చొప్పదండి ఎమ్మెల్యేగా సిరిసిల్ల జిల్లా వాసి | Sakshi
Sakshi News home page

చొప్పదండి ఎమ్మెల్యేగా సిరిసిల్ల జిల్లా వాసి

Published Mon, Dec 4 2023 1:50 AM

కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్తున్న వారిని తనిఖీ చేస్తున్న పోలీసులు - Sakshi

● ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన మేడిపల్లి సత్యం విజయం

బోయినపల్లి(చొప్పదండి): కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యేగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన మేడిపల్లి సత్యం విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన సత్యం సుంకె రవిశంకర్‌పై 36,910 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మేడిపల్లి సత్యం 2014లో టీడీపీ అభ్యర్థిగా, 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. రెండుసార్లు ఓడిపోయినప్పటికీ గత పదేళ్లుగా చొప్పదండి నియోజకవర్గంలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

గోవిందరావుపేటతండాలో దొంగతనం

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని గోవిందరావుపేటతండాకు చెందిన లౌడ్యా తేజ్‌ కిరాణాషాపులో ఆదివారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. గోవిందరావుపేటకు వెళ్లే దారిలో ప్రధాన రహదారిపై కిరాణాషాపు నిర్వహించుకుంటున్న తేజ్‌ శనివారం రాత్రి తాళం వేసి వెళ్లాడు. ఆదివారం ఉదయం చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో పరిశీలించారు. దుకాణంలో ఉన్న రూ.3,500 నగదు, రూ.1500 విలువైన సిగరెట్‌ ప్యాకెట్లు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయమై కోనరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

బోయినపల్లిలో

హస్తం హవా

బోయినపల్లి(చొప్పదండి): అసెంబ్లీ ఎన్నికల్లో బోయినపల్లి మండలంలో చొప్పదండి కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు 4,640 ఓట్ల మెజార్టీ లభించింది. మండలంలో మొత్తం 30,273 ఓట్లున్నాయి. 24,061 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి 12,101, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంకె రవిశంకర్‌కు 7,461, బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ కు 2,010 ఓట్లు వచ్చాయి.

కేసీఆర్‌ అత్తగారి గ్రామంలో కాంగ్రెస్‌ లీడ్‌

కేసీఆర్‌ అత్తగారి గ్రామం కొదురుపాకలో కాంగ్రెస్‌కు 779 ఓట్ల మెజార్టీ వచ్చింది. సత్యంకు 1,323, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 544, బీజేపీ అభ్యర్థికి 118 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అత్తగారి గ్రామం కోరెంలో బీఆర్‌ఎస్‌కు 595, కాంగ్రెస్‌కు 530, బీజేపీకి 40 ఓట్లు వచ్చాయి.

క్షుణ్ణంగా తనిఖీ

తంగళ్లపల్లి(సిరిసిల్ల):సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. మూడంచల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి కౌంటింగ్‌ కేంద్రాలకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కౌంటింగ్‌ పాసులు, ఏజెంట్‌ పాసులు ఉన్నవారినే లోపలికి అనుమతించారు. సెల్‌ఫోన్లను లోపలికి అనుమతించకపోవడంతో కొందరు ఏజెంట్లు ఇబ్బందులుపడ్డారు. సెల్‌ఫోన్లను వేరే వాళ్లకి అప్పగించి ఆ తరువాత లోపలికి వెళ్లాల్సి వచ్చింది. పోలీసులు ఏర్పాటు చేసిన పటిష్టమైన భద్రతతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే
1/1

మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే

Advertisement
Advertisement