ఆది నుంచి ఆధిక్యమే | Sakshi
Sakshi News home page

ఆది నుంచి ఆధిక్యమే

Published Mon, Dec 4 2023 1:54 AM

ఆది శ్రీనివాస్‌ - Sakshi

● వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్‌ ఘన విజయం ● అన్ని రౌండ్లలో హస్తం హవా

వేములవాడ: హోరాహోరీగా సాగిన వేములవాడ అసెంబ్లీ స్థానం ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌కు చెందిన చల్మెడ లక్ష్మినర్సింహారావుపై 14,581 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గంలో మొత్తం 19 రౌండ్ల లెక్కింపు సాగగా, మొదటి రౌండ్‌ నుంచి హస్తం హవా కొనసాగింది. ప్రతీ రౌండ్‌లోని ఆది శ్రీనివాస్‌ ఆధిక్యం కొనసాగించారు.

ఆది రాజకీయ నేపథ్యం

రుద్రంగికి చెందిన ఆది శ్రీనివాస్‌ 15–09–1966 జన్మించారు. విద్యార్థి నాయకుడిగా 1985–1986 నిజామాబాద్‌లో ఐటీఐ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీ రుద్రంగి గ్రామ ప్రధాన కార్యదర్శిగా 1987–1991 వరకు పనిచేశారు. 1991 నుంచి 1995 వరకు జిల్లా యువజన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. 29 సంవత్సరాల వయస్సులో 1995లో జిల్లాపరిషత్‌ సభ్యుడిగా పనిచేశారు. 1997లో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యుగా పనిచేశారు. 1997 నుంచి 2000 వరకు కరీంనగర్‌ జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ విధులు నిర్వహించారు. 2001 నుంచి 2005 వరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ వైస్‌ప్రెసిడెంట్‌, అధికారిక కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధిగా, 2001–2003 ఎంపీటీసీగా గెలిచి 2003 నుంచి 2006 వరకు ఎంపీపీగా పనిచేశారు. 2005 నుంచి 2007 వరకు, 2007–2009 రాజన్న ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా, 2009 సాధారణ ఎన్నికలు, 2010 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేశా రు. 2014 ఎమ్మెల్యే బీజేపీ నుంచి 2018లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేస్తూ వేములవాడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు.

కాంగ్రెస్‌ విజయోత్సవం

వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్‌ గెలుపొందడంతో పట్టణంలోని సాయినగర్‌లోని తన నివాసానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఆయన సతీమణి ఆది వనజకు శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంపిణీ చేశారు.

సంబరాలలో ఆది శ్రీనివాస్‌ సతీమణి,  మహిళా నాయకులు
1/1

సంబరాలలో ఆది శ్రీనివాస్‌ సతీమణి, మహిళా నాయకులు

Advertisement
Advertisement