లేనిది ఉన్నట్టు! | Sakshi
Sakshi News home page

లేనిది ఉన్నట్టు!

Published Mon, Mar 20 2023 4:34 AM

- - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పలు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు గుర్తింపు రెన్యూవల్స్‌, పీజీ కోర్సులకు అనుమతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. మెడికల్‌ బోర్డు తనిఖీలకు వచ్చే సమయంలో అద్దె రోగులు.. అతిథి అధ్యాపకులతో హడావుడి చేస్తున్నాయి. ఒక్కొక్కరికి రూ.500 కూలీ చెల్లించి.. మూడు పూటలా భోజనం.. వసతి కల్పించి గ్రామాల నుంచి గుట్టుగా బస్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. మెడికల్‌ బోర్డు అధికారుల తనిఖీల తర్వాత ఎవరి ఇళ్లకు వారిని పంపించేస్తున్నాయి. యాక్టింగ్‌ రోగులను చూసి.. అప్పటికే వివిధ రుగ్మతలతో బాధపడుతూ చికిత్సల కోసం ఆయా ఆస్పత్రుల్లో చేరిన నిజమైన రోగులు, వారి వెంట వచ్చిన బంధువులు ఈ తంతు చూసి నివ్వెరపోతున్నారు. జాతీయ వైద్య కమిషన్‌ ఇటీవల జిల్లాలోని ఓ ప్రముఖ మెడికల్‌ కాలేజీలో తనిఖీలు చేపట్టిన సమయంలో ఇదే సీన్‌ వెలుగు చూసింది. అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో యాజమాన్యాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ప్రత్యక్షంగా వీక్షించిన వారు ఆ దృశ్యాలను వీడియో తీసి.. సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అరకొర శిక్షణతో అవస్థలు

మొయినాబాద్‌, చేవెళ్ల, గండిపేట కేంద్రంగా ఐదు మెడికల్‌ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. ఎంబీబీఎస్‌, పీజీ కోర్సులు అందిస్తు న్నాయి. ఆయా వైద్య కళాశాలలు నిబంధనల మేరకు పనిచేస్తున్నాయా.. లేదా వంటి అంశాలను తనిఖీ చేసేందుకు జాతీయ వైద్య కమిషన్‌ ఎప్పటికప్పుడు తమ బృందాలను ఆయా కాలేజీలకు పంపుతుంది. వైద్య విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, రీసెర్చ్‌ అండ్‌ లేబరేటరీ, రికార్డుల నిర్వహణ, సీనియర్‌ అధ్యాపకులు, అనుబంధ ఆస్పత్రులు.. ఆస్పత్రులకు వచ్చే ఔట్‌ పేషంట్లు, ఇన్‌పేషంట్ల వంటి అంశాలను తనిఖీ బృందం పరిశీలిస్తుంది. మెజార్టీ కాలేజీల్లో వైద్య విద్యార్థుల నిష్పత్తి మేరకు మౌలిక సదుపాయాలు లేవు. ఇన్‌పేషంట్లే కాదు అవుట్‌ పేషంట్లు కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులతో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ప్రాక్టికల్స్‌ కూడా ఆశించిన స్థాయిలో నిర్వహించడం లేదు. ఓపీ, ఐపీ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఆశించిన స్థాయిలో వైద్య విద్యను నేర్చుకోలేకపోతున్నారు. తీరా కోర్సు పూర్తి చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తోంది. చాలా తక్కువ వేతనాలకే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఎంఓడీలుగా, ఎమర్జెన్సీ విభాగాల్లో పని చేస్తున్న సీనియర్లకు అసిస్టెంట్లుగా పని చేయాల్సి వస్తోంది. రూ.లక్షలు వెచ్చించి మేనేజ్‌మెంట్‌ కోటాలో పిల్లలను ఎంబీబీఎస్‌లో చేర్పించిన తల్లిదండ్రులు సైతం కెరీర్‌ విషయంలో పిల్లలు పడుతున్న ఇబ్బందులను చూసి ఆందోళన చెందుతున్నారు.

తనిఖీలకు ముందే లీకులు

గుట్టుగా చేపట్టాల్సిన తనిఖీలు రెండు మూడు రోజుల ముందే కాలేజీ యాజమాన్యాలకు తెలిసిపోతున్నాయి. దీంతో ముందే అప్రమత్తమవుతున్నాయి. వైద్య విద్యార్థుల హాజరు రికార్డులు, ప్రయోగశాలలు, వాటిల్లో ఉండాల్సిన మెటీరియల్‌, రికార్డులు, ఫ్యాకల్టీ, వారికి చెల్లిస్తున్న వేతనాలు, ఇతర మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రతిదీ పక్కగా అరేంజ్‌ చేస్తున్నాయి. ఉచిత వైద్య శిబిరాలు, వైద్య పరీక్షల పేరుతో గ్రామాల నుంచి గుట్టుగా ప్రజలను ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. వారు అడిగినంత కూలీ ఇచ్చి తీసుకొస్తున్నాయి. తనిఖీ బృందాల ముందు వారు కూడా ఓ సా ధారణ రోగిలా యాక్టింగ్‌ చేస్తుండటం విశేషం. తనిఖీలకు వచ్చిన బృందాలకు ఈ విషయం తెలిసీ యాజమాన్యాలు ఇచ్చే అమ్యామ్యాలకు అలవాటు పడి అన్నీ సవ్యంగా ఉన్నట్లు తప్పుడు రిపోర్టులు చేతికిచ్చి.. కిమ్మనకుండా వెనుతిరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైద్య విద్య నాణ్యత, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.

అద్దె రోగులు.. అతిథి అధ్యాపకులు

రూ.500 కూలీ.. వసతి ..

మూడు పూటలా భోజనం

గ్రామాల నుంచి గుట్టుగా

బస్సుల్లో ఆస్పత్రులకు తరలింపు

జిల్లాలోని పలు మెడికల్‌ కాలేజీల్లో

ఇదీ పరిస్థితి

మెడికల్‌ బోర్డు తనిఖీల సమయంలో హడావుడి

మెడికల్‌ కౌన్సిల్‌దే బాధ్యత

మెడికల్‌ కాలేజీలు గ్రామాలకు దూరంగా ఉంటున్నాయి. అధ్యాపకులు చాలా పరిమిత సంఖ్యలో ఉంటున్నారు. కాలేజీల నిష్పత్తికి తగినంత మంది అధ్యాపకులు ఉన్నారా? లేదా వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని మెడికల్‌ కౌన్సిల్‌ పట్టించుకోకపోవడంతో వైద్య విద్య నాసిరకంగా తయారవుతోంది. కాలేజీల్లో తమ పిల్లలను చేర్పించే ముందే తల్లిదండ్రులు ఆయా మెడికల్‌ కాలేజీల్లోని మౌలిక సదుపాయాలను పరిశీలించాలి. విద్యార్థులు కాలేజీలో ఫ్యాకల్టీ, ఓపీ, ఐపీ రోగులపై ఆరా తీయాలి. అన్నీ నిర్ధారించుకున్న తర్వాతే అందులో చేరాలి.

– డాక్టర్‌ నరేంద్రనాథ్‌, మాజీ డైరెక్టర్‌, నిమ్స్‌

1/1

Advertisement
Advertisement