బఫర్‌.. ఫియర్‌ | Sakshi
Sakshi News home page

బఫర్‌.. ఫియర్‌

Published Tue, Mar 21 2023 6:48 AM

గూగుల్‌లో చక్కర్లు కొడుతున్న ఫార్మాసిటీ బఫర్‌జోన్‌ మ్యాప్‌    - Sakshi

ఫార్మాసిటీ పరిధిలోబఫర్‌జోన్‌పై ప్రచారం

అధికారుల నుంచి కరువైన స్పష్టత

నిలిచిపోయిన భూ క్రయవిక్రయాలు

ఆందోళనలో రైతులు, రియల్టర్లు

యాచారం: ఫార్మాసిటీ బఫర్‌జోన్‌ ప్రచారం రైతులు, రియల్టర్ల కంటికి కునుకు లేకుండా చేస్తోంది. గూగుల్‌లో ఓ మ్యాప్‌ చక్కర్లు కొడుతుండడం, అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల సరిహద్దులోని యాచారం, కందుకూరు, కడ్తాల్‌ మండలాల పరిధిలోని పది గ్రామాల్లో 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తోంది. 2016 నుంచి ప్రారంభమైన భూసేకరణ ప్రస్తుతం 70 శాతనికిపైగా జరిగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రహదారుల నుంచి విశాలమైన వంద అడుగుల రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఫార్మాసిటీకి సేకరించిన భూమిలో ప్రముఖ కంపెనీలకు భూములు కేటాయించడం కోసం బిట్లుబిట్లుగా వెంచర్లు చేసి రోడ్డు నిర్మాణ పనులకు గుట్టలు, రాళ్లను తవ్వి చదును చేశారు. ఫార్మాసిటీ వైపే చూపంతా ఉండడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న బడా వ్యాపారులు చుట్టు పక్కల వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. ఉన్నతాధికారులు, రాజకీయ పెద్దలు, వ్యాపారులు 500 నుంచి రెండు వేల గజాల్లో ఆయా వెంచర్లలో ప్లాట్లు కొన్నారు. ప్రసుత్తం ఫార్మాసిటీ చుట్టూ మూడు కిలోమీటర్ల మేర బఫర్‌ జోన్‌ ఏర్పాటవుతుందనే ప్రచారంతో స్థానిక రైతులు, రియల్టర్లు ఆందోళనకు గురవుతున్నారు.

వెంచర్లకు అనుమతుల నిరాకరణ?

ఫార్మాసిటీ చుట్టూ మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసే హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వెంచర్లకు పంచాయతీ అధికారులు అనుమతులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. యాచారం, కందుకూరు, కడ్తాల్‌, ఆమనగల్లు, మాడ్గుల తదితర మండలాల్లో ప్రసుత్తం వెయ్యి ఎకరాలకుపైగా కొత్తగా వందకు పైగా హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. ఈ వెంచర్లకు ప్రసుత్తం డీటీసీపీ, హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతులు మంజూరు చేయడం లేదని తెలిసి రూ. వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. ఫార్మాసిటీతో ఎకరా భూమి రూ.కోటిన్నరకు పైనే డిమాండ్‌ ఉండేదని, ప్రస్తుతం బఫర్‌ జోన్‌ అంటుండడంతో సగానికి పైగా ధరలు పడిపోయినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. వెంచర్లలో గజం ధర రూ.6 వేల నుంచి రూ.15 వేలకు పైగా పలికిందని, ప్రస్తుతం కొనేవారే రావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

పెద్దల దృష్టికి

బఫర్‌ జోన్‌పై స్థానికుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కడ్తాల్‌, ఆమనగల్లు మండలాల రైతులు, రియల్టర్లు ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పష్టత కోసం ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్‌ యాదవ్‌ మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. కాగా, ఫార్మాసిటీ చుట్టూ బఫర్‌జోన్‌ వ్యవహారంపై స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.

స్పష్టత లేదు

ఫార్మాసిటీ ఏర్పాటయ్యే బఫర్‌జోన్‌పై స్పష్టత లేదు. రెవెన్యూ, టీఎస్‌ఐఐసీ అధికారులకే తెలుస్తుంది. ఫార్మాసిటీ చుట్టూ ఉన్న మండలాల్లో వ్యవసాయ భూములకు తహసీల్దార్లు ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసి, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ కింద వెంచర్లకు అనుమతి కోరితే నిబంధనల ప్రకారం పరిశీలించి అనుమతులు ఇస్తాం. బఫర్‌జోన్‌పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పష్టత తీసుకుంటా.

– శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

తప్పక చదవండి

Advertisement