రేషన్‌.. ఉండదిక పరేషాన్‌! | Sakshi
Sakshi News home page

రేషన్‌.. ఉండదిక పరేషాన్‌!

Published Sun, Mar 26 2023 4:46 AM

రేషన్‌ దుకాణంలో సరుకులు తీసుకుంటున్న లబ్ధిదారులు(ఫైల్‌) - Sakshi

కొత్తూరు: ఉపాధి కోసం చాలామంది సొంత రాష్ట్రాలను వదిలి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. వెళ్లిన చోట ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్‌ సరుకులు తీసుకునేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఇలాంటి సమస్యలను అధిగమించడంతో పాటు రేషన్‌ సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత ఉండేలా కేంద్రప్రభుత్వం ‘వన్‌ నేషన్‌–వన్‌ రేషన్‌’లో భాగంగా ‘మేరా రేషన్‌ యాప్‌’ను ఆవిష్కరించింది. ఇందులో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్‌ దుకాణాలు.. సరుకులు తదితర వివరాలను అందుబాటులో ఉంచింది. ఈ యాప్‌ ద్వారా వలసదారులకు తాము నివాసం ఉన్నచోట కూడా రేషన్‌ సరుకులు తీసుకునేందుకు వీలు కల్పించింది. ప్రస్తుతం ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది.

అక్రమాలు అరికట్టేందుకు..

జిల్లాలో 23 లక్షల కార్డుదారులకు గాను 456 మంది రేషన్‌ డీలర్లు ఉన్నారు. వీరంతా ప్రతినెలా ప్రభుత్వానికి డీడీలు చెల్లిస్తే దుకాణాలకు సరకులు అందుతాయి. వాటిని డీలర్లు కార్డుదారులకు పంపిణీ చే స్తారు. రేషన్‌ సరుకుల పంపిణీలో అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం సరుకులు తీసుకునేందుకు వచ్చే లబ్ధిదారుడి ఫోన్‌కు ఓటీపీ లేదా ఐరిస్‌ విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో సరుకులు తీసుకునేందుకు కచ్చితంగా లబ్ధిదారుడే రావాల్సి ఉంటుంది.

మేరా రేషన్‌ యాప్‌ సేవలు..

● ఏ రాష్ట్రానికి చెందిన లబ్ధిదారుడైనా దేశంలో తాను వలస వెళ్లిన ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ రేషన్‌ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చు.

● మొదటగా లబ్ధిదారుడు తమ రేషన్‌కార్డుకు తన ఆధార్‌కార్డును అనుసంధానం చేసుకోవాలి.

● కొత్త ప్రాంతాల్లో రేషన్‌ దుకాణాల వివరాల గురించి ఎవరినీ అడగాల్సిన అవసరం లేకుండానే యాప్‌లో అన్ని వివరాలు ఉంటాయి.

● రేషన్‌కార్డు ద్వారా ఇటీవల జరిపిన లావాదేవీలు, గడిచిన ఆరునెలల్లో లబ్ధిదారుడు ఏ దుకాణంలో ఏఏ సరుకులు తీసుకున్నారో వివరాలు నమోదు చేస్తారు.

● కొన్నిచోట్ల లబ్ధిదారుడు సరుకులు తీసుకోకున్నా తీసుకున్నట్లు చూపితే యాప్‌ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

● రేషన్‌ డీలర్లు సమయపాలన పాటించకున్నా, అక్రమాలకు పాల్పడినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో మొత్తం గ్రామాలు: 558

మున్సిపాలిటీలు: 14

కార్పొరేషన్లు: 02

మొత్తం రేషన్‌ దుకాణాలు: 919

అహార భద్రత కార్డుదారులు: 5,24,074

అంత్యోదయ కార్డుదారులు: 34,748

అన్నపూర్ణ కార్డుదారులు: 40

మొత్తం లబ్ధిదారులు:

సుమారు 18,26,523 లక్షల మంది

ప్రతీనెల పంపిణీ చేసే బియ్యం:

10 వేల మెట్రిక్‌ టన్నులు

వలసదారులకు ఉపయుక్తంగా

‘మేరా రేషన్‌ యాప్‌’

యాప్‌లో దుకాణం, సరుకుల వివరాలు

దేశంలో ఎక్కడినుంచైనా తీసుకునే వీలు

అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం

స్థానికంగా సరుకులు

వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌లో భాగంగా ‘మేరా రేషన్‌ యాప్‌’ ద్వారా మొదట్లో అయా రాష్ట్రాలకు చెందిన లబ్ధిదారులకు స్థానికంగా రేషన్‌ సరుకులు ఇచ్చాం. ప్రస్తుతం కొన్నిచోట్ల యాప్‌లో ఆధార్‌కార్డు నంబర్‌తో వివరాలు నమోదవుతున్నా.. మరికొన్ని చోట్ల పలు కారణాలతో కార్డుదారుల వివరాలు రావడం లేదు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

– కడెంపల్లి భాస్కర్‌, రేషన్‌ డీలర్‌, కొత్తూరు

1/1

Advertisement
Advertisement