సిరుల పంట సీఎం ఘనతే | Sakshi
Sakshi News home page

సిరుల పంట సీఎం ఘనతే

Published Thu, Jun 8 2023 3:50 AM

మహేశ్వరంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి  - Sakshi

మహేశ్వరం: తెలంగాణలో సిరుల పంటలు పండుతున్నాయని, వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని పోతర్ల బాబయ్య హాల్‌లో బుధవారం నిర్వహించిన సాగునీటి దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు త్వరితగతిన పూర్తి చేసి.. సాగునీటితో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును కేవలం నాలుగేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. ఇదే తరహాలో పాలమూరును పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రూ.10 వేల కోట్లతో రాష్ట్రంలోని 27 వేల చెరువులు, కుంటల్లో అభివృద్ధి పనులు చేశారన్నారు. మిషన్‌ కాకతీయతో చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మత్స్యకారులు, ముదిరాజులకు ఆర్థిక లబ్ధి చేకూరిందన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో 40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండగా.. ప్రస్తుతం 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోందని, ఇది పంజాబ్‌ కన్నా అధికమని వివరించారు. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందజేస్తున్న ఏకై క ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ అని స్పష్టంచేశారు. ఇంద్రారెడ్డి ప్రత్యేక ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ అనే పదాన్ని పలికేందుకు కూడా నాయకులు భయపడేవారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్‌గుప్త, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ సునీతానాయక్‌, జెడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు కమిటీ సభ్యులు కూన యాదయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ మంచె పాండు, ఆర్డీఓ సూరజ్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ హైదర్‌ఖాన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నర్సింహులు, డీఈ దుదియా నాయక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ జగన్మోన్‌రెడ్డి, తహసీల్దార్‌ మహమూద్‌అలీ, ఎంపీడీఓ నర్సింహ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సాగులో సంచలనం

కేసీఆర్‌ విజన్‌తోనే సాధ్యమైంది

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి

మిగిలింది ‘పాలమూరే’..

యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం

ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం

ధాన్య భాండాగారం తెలంగాణ

సాగునీటి దినోత్సవంలో మంత్రి సబితారెడ్డి

చేవెళ్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ వల్లే తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచిందని ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం చేవెళ్లలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం నిర్వహించారు. వేడుకలకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతి, చేపట్టిన కార్యక్రమాలపై వీడియోను ప్రదర్శించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో సంచలనం సృష్టించామని తెలిపారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌తో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 19లక్షల ఎకరాల సాగు పెంచారని గుర్తు చేశారు. ఒకప్పుడు ఆకలి కేకలతో అలమటించిన తెలంగాణ.. నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని సంతోషం వ్యక్తంచేశారు. ఇది కేసీఆర్‌ దూరదృష్టి, పట్టుదల, కృషితోనే సాధ్యమైందన్నారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో రైతు కంట నీరు వస్తే నేడు పొలంలో సాగునీరు పారుతోందని తెలిపారు. బీడు నేలలను కాళేశ్వరం జలాలతో తడిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రంగారెడ్డి, ఈఈ రేణుకాదేవి, డీఈఈ వెంకటరమణ, పరమేశ్వర్‌, ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, నీటిపారుదల శాఖ ఏఈలు లక్ష్మి, రాధిక, గోపినాథ్‌, సురేశ్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు నర్సింహులు, లింగం, పండరి, ఐకేపీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చేవెళ్లలో మాట్లాడుతున్న ఎంపీ రంజిత్‌రెడ్డి
1/1

చేవెళ్లలో మాట్లాడుతున్న ఎంపీ రంజిత్‌రెడ్డి

Advertisement
Advertisement