రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తాం | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తాం

Published Sat, Sep 23 2023 6:16 AM

సమస్యలు వింటున్న కలెక్టర్‌ హరీశ్‌, ఎమ్మెల్యే  కిషన్‌రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి    - Sakshi

ఇబ్రహీంపట్నం: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ హరీశ్‌ తెలిపారు. నియోజకవర్గంలోని భూ సమస్యలపై శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మల్కీజ్‌గూడ రైతుల భూ సమస్య కొలిక్కివచ్చిందని, సీసీఎల్‌ఏకి నివేదిక పంపించినట్టు చెప్పారు. త్వరలో పరిష్కారమవుతుందని వెల్లడించారు. గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న, పహాణీల్లో నమోదై భూమిని సాగుచేసుకుంటున్న వారిని గుర్తించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కలెక్టర్‌కు సూచించారు. వివిధ రక్షణ సంస్థలకు కేటాయించిన అనంతరం ఇబ్రహీంపట్నం భగాయత్‌ సైదాబాద్‌ కంచెలో మిగిలిన భూమికి సంబంధించిన రైతులకు ధరణి ద్వారా పాస్‌ పుస్తకాలు అందజేయాలని కోరారు. దండుమైలారం హఫీజ్‌పూర్‌ రెవెన్యూ పరిధిలోని 230 ఎకరాల పట్టా భూమి రైతులకు కొత్త పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. నాగన్‌పల్లి, రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్లాట్ల సర్టిఫికెట్లు గల వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. కొహెడ పిల్లగుట్ట భూమి, బాటసింగారం లాజిస్టిక్‌ పార్కు, రైతుల ప్లాట్లు, నివాస స్థలాలకు భూముల గుర్తింపు, ఖాగజ్‌ఘాట్‌, ఆరుట్ల, శేరిగూడ భూవిస్తీర్ణం హెచ్చుతగ్గుల సమస్యలను ప్రత్యేకాధికారులు అందజేసే నివేదికల ఆధారంగా పరిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. కాగజ్‌ఘాట్‌ అసైన్డ్‌ రైతులకు కొత్త పాసుపుస్తకాలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ధరణికి సంబంధించిన భూ సమస్యలను తహసీల్దార్లు, ఆర్డీఓలకు రైతులు నేరుగా వివరించాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, తహసీల్దార్లు అన్వర్‌, శ్రీకాంత్‌రెడ్డి, ప్రసాద్‌, రవీంద్రదత్తు, వెంకటేశ్వర్లు, ఎంపీపీ కృపేశ్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ హరీశ్‌

Advertisement
Advertisement