సీఎం బొమ్మపై సీసీఎల్‌ఏకు లేఖ | Sakshi
Sakshi News home page

సీఎం బొమ్మపై సీసీఎల్‌ఏకు లేఖ

Published Thu, Oct 12 2023 5:30 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరీశ్‌  - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ(జీఓ నంబర్‌ 59)లో భాగంగా లబ్ధి దారులకు అందజేస్తున్న రిజిస్ట్రేషన్‌ పత్రాలపై సీఎం ఫొటో ప్రచురించిన విషయం విధితమే. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆయా రిజిస్ట్రేషన్‌ పత్రాలపై సీఎం ఫొటో ఉండటాన్ని పలు రాజకీయ పార్టీలు తప్పు పడుతున్నాయి. ఇదే అంశాన్ని సీసీఎల్‌ఏకు వివరించాను. ఈ మేరకు ఇటీవల ఓ లేఖ కూడా రాశాను’ అని జిల్లా కలెక్టర్‌ హరీష్‌ చెప్పారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌కు ముందు అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు, పత్రాలపై అధికార పార్టీ మంత్రుల పేర్లు, ఫొటోలు ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని సీసీఎల్‌ఏ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఎన్నికల కమిషన్‌ ఏ ఒక్క పార్టీకి అనుకూలం కాదు. ఎన్నికలు, సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తుంది. సభలు, సమావేశాలు, ప్రచారం వంటి అంశాల్లో అన్ని పార్టీలకు సమప్రాధాన్యత ఇస్తుంది.

70 మంది బైండోవర్‌

ఓటర్లను భయాందోళనలకు గురి చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోం. ఇప్పటికే 70మంది వీధి రౌడీలను బైండోవర్‌ చేశాం. నేతలు, ఇతర వ్యాపారుల వద్ద ఉన్న 58 ఆయుధాలను సరెండర్‌ చేయించాం. తనిఖీల్లో భాగంగా బుధవారం వరకు జిల్లాలో రూ.1, 62,65,360 నగదు స్వాధీనం చేసుకున్నాం. 24 లీటర్ల మద్యం బాటిళ్లను సీజ్‌ చేశాం..ఆస్పత్రి బిల్లుల చెల్లింపు, ఇతర అవసరాల కోసం అంతకు మించి నగదు తీసుకెళ్లే వారు సంబంధిత పత్రాలను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. ఇందుకోసం జిల్లా స్థాయిలో గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేశాం. జెడ్పీ సీఈఓ దీనికి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

1206 సమస్యాత్మక కేంద్రాలు

జిల్లాలో మొత్తం 33,56,056 మంది ఓటర్లు ఉన్నారు. 16,15,876 మంది మహిళా ఓటర్లు, 17,38,994 మంది పురుష ఓటర్లు, 596 మంది ఇతర ఓటర్లు, 590 సర్వీసు ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,369 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 1206 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించాం. మరో 10 అతి క్లిష్టమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. భారీ పోలీసు బందోబస్తుతో పాటు మైక్రో అబ్జర్వర్స్‌ పరిశీలనలో ఉండనున్నాయి. ఎంసీఎంసీ, సోషల్‌ మీడియా బృందాలు పని చేస్తాయి. ఎన్నికల ఖర్చు కోసం రేట్‌ చార్ట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాం.

కోడ్‌ ఉల్లంఘిస్తే.. కేసులే..

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే వారిపై సంబంధిత చట్టాలను అనుసరిస్తూ కేసులు నమోదు చేస్తాం. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే లౌడ్‌ స్పీకర్లకు అనుమతి ఉంది. ఆ తర్వాత వాడితే కేసులు నమోదు చేస్తాం. కోడ్‌ ఉల్లంఘనలపై ప్రజలు నేరుగా 1950 టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు ఫిర్యాదు చేయవచ్చు. ఈసారి కొత్తగా సీ–విజిల్‌ యాప్‌ను అందుబాటులో తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా కోడ్‌ ఉల్లంఘన అంశాలు లైవ్‌ ఫోటోలు, వీడియోలు తీసి ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకురావొచ్చు. ఫిర్యాదు చేసిన వంద నిమిషాల్లో భద్రత, తనిఖీ బృందాలు ఘటనా స్థలికి చేరుకుంటాయి.

80 ఏళ్ళు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

అందుబాటులో ‘సువిధ’ పోర్టల్‌

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో సభలు, సమావేశాలకు అనుమతి లేదు. విధిగా వాటికి అనుమతి తీసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ ‘సువిధ’ ఫోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ముందు అనుమతి ఇస్తాం. దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతులు జారీ చేస్తాం. అంతేకాదు ఫ్లెక్సీ తయారీ మరియు ప్రింటింగ్‌ ప్రెస్‌ల యజమానులు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పార్టీలు ముద్రించే కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రింట్‌ చేసినప్పుడు వాటిపై ఫర్మ్‌ పేరు , ప్రింటర్‌ పేరు, ఫో న్‌ నెంబర్‌ విధిగా ముద్రించాలి. ప్రింటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో రిజిస్టర్లు నిర్వహించాలి. లేదంటే వారిపై చర్యలు తప్పవు.

ఏ ఒక్క పార్టీకి అనుకూలం కాదుః

ఎన్నికల షెడ్యూలు రాగానే ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. అందరూ ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి పని చేయాల్సిందే. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్క పార్టీ వైపు మొగ్గు చూపినట్లు కన్పించినా...ప్రచార సభల్లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పాల్గొన్నా..అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినా...అట్టి వారిపై చర్యలు తప్పవు. ఎన్నికల సంఘం ఏ ఒక్క పార్టికి అనుకూలం కాదు.

వచ్చే ఎన్నికల నాటికి

అక్కడ కూడా పోలింగ్‌ కేంద్రాలు

జిల్లాలో అనేక గేటెడ్‌ కమ్యూనిటీలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పోలింగ్‌ కేంద్రాలకు దూరంగా ఉన్నాయి. 1200పైగా ఓటర్లు ఉన్న ఆయా గేటెడ్‌ కమ్యూనిటీల్లోనూ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించాం. ఆ మేరకు 40 గేటెడ్‌ కమ్యూనిటీలకు నోటీసులు ఇచ్చాం. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఒక గేటెడ్‌ కమ్యూనిటీ మినహా ఇతరులు ముందుకు రాలేదు. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి గేటెడ్‌ కమ్యూనిటీల్లోనూ పోలీంగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి తీరుతాం.

జీఓ నంబర్‌ 59 భూముల రిజిస్ట్రేషన్లపై ఫొటో

రూ.1,62,65,360 నగదు, 24 లీటర్ల మద్యం సీజ్‌

వచ్చే ఎన్నికల్లో గేటెడ్‌ కమ్యూనిటీల్లో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కృషి

అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం కల్పిస్తా

విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ హరీశ్‌

Advertisement
Advertisement