అలా అయితే రాష్ట్రం ఆగమైతది | Sakshi
Sakshi News home page

అలా అయితే రాష్ట్రం ఆగమైతది

Published Wed, Nov 22 2023 4:30 AM

మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ - Sakshi

రోడ్‌షోలో మంత్రి కేటీఆర్‌

‘తలసాని’కి మద్దతుగా ప్రచారం

అమీర్‌పేట: హైదరాబాద్‌ నగరం బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది..హైదరాబాదే మనకు కామధేనువు.. దీనిని అడ్డమైన వారి చేతిలో పెడితే తెలంగాణ ఆగమైతది అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ నాయకులనుద్దేశించి పేర్కొన్నారు. పిల్ల దొరక్క ముందే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్న చందంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకుల తీరు ఉందని.. ఎన్నికల్లో గెలవలేని స్థితిలో ఉన్నా సీఎంలుగా ప్రమాణం చేస్తామని తేదీలను ప్రకటించుకుంటున్నారని విమర్శించారు. మంగళవారం రాత్రి సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతుగా అమీర్‌పేటలో రోడ్‌ షో నిర్వహించారు. సత్యం థియేటర్‌ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..పదవుల కోసం ప్రాణాలు తీసే పార్టీలను నమ్ముదామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకుల తీరు నా కంటే ప్రజలకే బాగా తెలుసని అన్నారు. గతంలో సనత్‌నగర్‌ నుండి గెలుపొంది సీఎం అయిన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ గురించి చెప్పిన మాటలను గుర్తు చేశారు. నన్ను సీఎం పదవి నుంచి దించేందుకు మా వాళ్లే మతకల్లోలాలకు తెరతీశారని స్వయంగా మర్రి చెన్నారెడ్డి అన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో వారానికి మూడు రోజులు పవర్‌ హాలిడే ఉండేదని.. ఇపుడు 24 గంటలు ఇస్తే అసలు కరెంటు ఎక్కడుంటోందని రేవంత్‌రెడ్డి అంటున్నారన్నారు. బీజేపీ నాయకుల మాటలను కూడా ప్రజలు నమ్మరాదని సూచించారు. ఒక్క కేసీఆర్‌కు వ్యతిరేకంగా దేశ ప్రధానితో పాటు అమిత్‌షా, బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తెలంగాణకు వస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఓట్ల కోసం వచ్చి మాయమాటలు చెప్పే పార్టీలను నమ్మితే మనం మోసపోతామన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, కార్పొరేటర్‌ కొలను లక్ష్మిబాల్‌రెడ్డి మాజీ కార్పోరేటర్‌ ఎన్‌.శేషుకుమారి, గులాబ్‌సింగ్‌, లలితాచౌహన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement