5 వేల మందితో బందోబస్తు.. | Sakshi
Sakshi News home page

5 వేల మందితో బందోబస్తు..

Published Mon, Nov 27 2023 7:10 AM

- - Sakshi

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ నుంచి నారాయణగూడ, వైఎంసీఏ, వీరసావర్కర్‌ చౌరస్తా వరకు రోడ్‌ షో
ట్రాఫిక్‌ ఆంక్షలు

మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో.. ఒక రోజు ముందుగానే నగరంలో బీజేపీ భారీ రోడ్‌షో చేపట్టనుంది. ప్రచారం ఫైనల్‌ టచ్‌లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం నగరంలో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ నుంచి సాయంత్రం 5 గంటలకు రోడ్‌ షో చేపట్టనున్నారు. టివోలీ హోటల్‌, నారాయణగూడ ఫ్లై ఓవర్‌, వైఎంసీఏ మీదుగా కాచిగూడలోని వీరసావర్కర్‌ చౌరస్తాకు చేరుకోనుంది. గ్రేటర్‌ పరిధిలోని 24 మంది బీజేపీ అభ్యర్థులతో పాటు సుమారు లక్ష మంది ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. –సాక్షి, సిటీబ్యూరో

హాజరుకానున్న 24 మంది బీజేపీ అభ్యర్థులు

లక్ష మందికిపైగా పార్టీ శ్రేణులు పాల్గొనే అవకాశం

కాషాయమయం కానున్న భాగ్య నగరం

ప్రధాని పర్యటనకు భారీగా బలగాల మోహరింపు

ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

2 కి.మీ మేర రోడ్‌ షో.. కాచిగూడలో ప్రధాని ప్రసంగం..

● ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో రోడ్‌ షో కొనసాగనుంది. కాచిగూడ సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి కమలనాథులను ఉద్దేశించి ప్రధాని ప్రసగించనున్నారు. గ్రేటర్‌ చరిత్రలో ఓ ప్రధాని స్థాయి వ్యక్తి రోడ్‌ షో నిర్వహించడం అరుదైన అంశంగా చెప్పుకోవచ్చు.

అప్పట్లోనే అనుకున్నారు కానీ..

● హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ వేదికగా జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన ఈ సమావేశాలకు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. నిజానికి అప్పట్లోనే హైటెక్‌ సిటీ నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వరకు రోడ్‌షో నిర్వహించాలని భావించారు. భద్రతాపరమైన కారణాలతో అనుమతి రాలేదు. దీంతో ఆ యన నేరుగా పరేడ్‌గ్రౌండ్‌ వేదికగా నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు చేరుకోవాల్సి వచ్చింది.

● ఆ తర్వాత బేగంపేటకు చేరుకుని అక్కడే బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసగించారు. ఐఎస్‌బీ పర్యటనకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన బీసీ సీఎం డిక్లరేషన్‌ సభలో పాల్గొన్నారు. ఇటీవల ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ సభకు హాజరైన మోదీ.. రెండు రోజుల క్రితం మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. శని, ఆదివారాల్లో నగరం నుంచి రాకపోకలు సాగించిన మోదీ.. శ్రీవారి దర్శనార్థం తిరుపతి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం మహబూబాబాద్‌, కరీంనగర్‌లలో పర్యటించి, సాయంత్రం 4 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. ఐదు గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌కు చేరుకున్న అనంతరం రోడ్‌ షోలో పాల్గొంటారు.

మోదీ..

ఆజ్‌ గ్రేటర్‌

ఆవాజ్‌

ప్రధాని మోదీ నగర పర్యటన నేపథ్యంలో పోలీసు విభాగం ఐదు వేల మందితో పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) బ్లూ బుక్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర, పోలీసు బలగాల అధీనంలో ఉన్న రూట్లను సోమవారం ఎస్పీజీ తమ అఽధీనంలోకి తీసుకోనుంది. రోడ్‌ షో జరిగే చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున బలగాలు మోహరించనున్నాయి. బందోబస్తు, భద్రత విధుల్లో ఎస్పీజీ, ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్‌, శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, సీఏఆర్‌ విభాగాలు, కేంద్ర బలగాల సిబ్బంది పాల్గొంటాయి. ఆదివారం రాత్రి నుంచే నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. ఆయా ప్రాంతాల్లో నిర్ణీత వేళల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. ఈసారి గగనతల నిఘాను సైతం ఏర్పాటు చేశారు. రూఫ్‌ టాప్‌ వాచ్‌ కోసం రోడ్‌ షో జరిగే మార్గం చుట్టుపక్కల ఎత్తయిన భవనాలపై సుశిక్షితులైన స్నైపర్స్‌ను మోహరిస్తున్నారు.

సోమవారం ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి కాచిగూడ ఎక్స్‌ రోడ్స్‌ వరకు ప్రధాని నరేంద్రమోదీ రోడ్డు షో నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి బేగంపేట్‌, గ్రీన్‌లాండ్స్‌, పంజగుట్ట, మొనప్ప ఐలాండ్‌, రాజ్‌భవన్‌, వీవీ విగ్రహం, నిరంకారీ భవన్‌, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, నెక్లెస్‌ రోటరీ, తెలుగు తల్లి జంక్షన్‌, కట్టమైసమ్మ ఆలయం, ఇందిరా పార్కు, అశోక్‌నగర్‌ ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ క్రాస్‌ రోడ్స్‌ వరకు రోడ్‌ షో ఉంటుంది. ప్రధాని పర్యటన, రోడ్‌ షో సందర్భంగా ఆయా రూట్లలో ట్రాఫిక్‌ను ఇతర మార్గాలలోకి మళ్లిస్తామని అదనపు సీపీ వెల్లడించారు.

1/2

2/2

Advertisement
Advertisement