జోరు తగ్గిన ‘కారు’ | Sakshi
Sakshi News home page

జోరు తగ్గిన ‘కారు’

Published Wed, Dec 6 2023 6:22 AM

శంకర్‌పల్లి: ఎమ్మెల్యే యాదయ్యను సన్మానిస్తున్న మిర్జాగూడ నాయకులు   - Sakshi

చేవెళ్ల: చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కారు జోరు తగ్గింది. గత ఎన్నికల్లో 33వేల పై చిలుకు ఓట్లు సాధించిన టీఆర్‌ఎస్‌.. ఈ ఎన్నికల్లో కేవలం 268 ఓట్లకు పడిపోయింది. ఈ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసిన 12 మంది అభ్యర్థులలో స్వగ్రామంలో పట్టు సాధించిన కాలె యాదయ్యను విజయం వరించింది. దీంతో మూడవ సారి విజయంతో హ్యాట్రిక్‌ సాధించాడు. అదే కాంగ్రెస్‌ అభ్యర్థి పామెన భీంభరత్‌కు తృటిటో విజయాన్ని దూరం చేసిందని చెప్పాల్సిందే. కాలె యాదయ్య స్వగ్రామంలో సాధించిన మోజార్టీ 346 ఓట్లు అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి సాధించిన ఓట్లు కేవలం 67 మాత్రమే కావటంతో కాంగ్రెస్‌ అభ్యర్థికి అదే మోజార్టీ ఎక్కువగా వచ్చి ఉంటే గెలుపు కాంగ్రెస్‌కి దక్కేది విశ్లేషకులు అభిప్రాయం. ఇక మిగత 10 మంది అభ్యర్థులైతే స్వగ్రామంలోనే వెనకంజలో ఉండిపోయారు. బీజేపీ అభ్యర్థి కేఎస్‌ రత్నం మినహా ఏ అభ్యర్థికి వారి స్వగ్రామంలో కనీస ఓట్లు కూడా రాలేదు.

సొంత గ్రామాల్లో పోలైన ఓట్లు

చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కాలె యాదయ్యది వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం చించల్‌పేట. ఇక్కడ మూడు పోలింగ్‌ బూత్‌లలో 2,368 ఓటర్లున్నారు. 1595 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోగా 944 మంది ఓటర్లు కారు గుర్తుకు ఓటేసి యాదయ్యను దీవించారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థికి 316, బీజేపీ అభ్యర్థికి 282, నోటాకు 19 మంది ఓటేశారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు 59 శాతం మెజార్టీ వచ్చింది.

స్వగ్రామంలో స్వల్ప మెజారిటీ

ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి పామెన భీంభరత్‌ షాబాద్‌ మండలంలోని నారెడ్లగూడ. కుమ్మరిగూడలోని రెండు పోలింగ్‌ బూత్‌లలో ఈ గ్రామానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 1,948 ఓట్లు ఉండగా 1,439 పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థి పామెన భీంభరత్‌కు 634 ఓట్లు రాగా బీఆర్‌ఎస్‌కు 567, బీజేపీకి 168 పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్‌కు స్వల్పంగా 67 ఓట్లు మోజార్టీ వచ్చింది. స్వగ్రామంలో తగ్గిన మోజార్టీతో కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ అభ్యర్థి కెఎస్‌ రత్నం సొంత గ్రామమైన మొయినాబాద్‌ మండలంలోని కేతిరెడ్డిపల్లిలోనూ ఆయనకు 248 ఓట్లు మైనస్‌లో ఉన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి కంటే తక్కువగా ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లు 1,912 ఉంటే 1,490 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి రత్నంకు 330 ఓట్లు వస్తే కాంగ్రెస్‌కు 578, బీఆర్‌ఎస్‌కు 555ఓట్లు వచ్చాయి. దీంతోఆయన మూడవస్థానానికే పరిమితమయ్యాడు.

ఆధిక్యమిచ్చిన మండలాలు

నియోజకవర్గంలోని ఐదు మండలకేంద్రాల్లో మూడు కాంగ్రెస్‌కు రెండు బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం ఇచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలె యాదయ్య సొంత మండలం నవాబుపేట మండలకేంద్రంలో కాంగ్రెస్‌కు 81ఓట్లు ఎక్కువగా వచ్చాయి. చేవెళ్ల మండలకేంద్రంలో కాంగ్రెస్‌కు 856 ఓట్లు ఆధిక్యం అభించింది. షాబాద్‌ మండల కేంద్రంలో 296 ఓట్లు కాంగ్రెస్‌కు మోజార్టీ ఇచ్చాయి. మొయినాబాద్‌ మండలకేంద్రంలో 124 ఓట్లు బీఆర్‌ఎస్‌కు శంకర్‌పల్లి మండలకేంద్రంలో 334 ఓట్లు కారు మెజార్టీ వచ్చింది. మండలం మొత్తంగా చూసుకుంటే నవాబుపేట, శంకర్‌పల్లి మండలాలు బీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఇస్తే చేవెళ్ల, షాబాద్‌, మొయినాబాద్‌ మండలాలు హస్తానికి ఆధిక్యమిచ్చాయి. కాంగ్రెస్‌కే ఎక్కువగా మండలాలు మొగ్గు చూపిన యాదయ్య సొంత గ్రామం, శంకర్‌పల్లి మండలం ఇచ్చిన మోజార్టీ ఎక్కువగా ఉండటంతో స్వల్ప మెజార్టీతో యాదయ్య విజయ సాధించారు.

ధరావతు కోల్పోయిన

తొమ్మిది మంది అభ్యర్థులు

చేవెళ్ల అసెంబ్లీ నుంచి పోటీ చేసిన 12 మంది అభ్యర్థులలో ప్రధాన పార్టీలకు చెందిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను మినహాయిస్తే 9మంది అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 76,218ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పామెన భీంభరత్‌కు 75,950 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నంకు 37,763 ఓట్లు పోలయ్యాయి. మిగిలిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు ధరావతు కోల్పోయారు. బీఎస్పీ నుంచి పోటీ చేసిన రాజామహేంద్ర వర్మకు కేవలం 1,720 ఓట్లు, ప్రజా వెలుగు పార్టీ నుంచి పోటీచేసిన దుర్గాప్రసాద్‌కు 871 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి తుడు పాండుకు రోడ్డు రోలర్‌ గుర్తు రావటంతో 757 ఓట్లు, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దెల సత్యనారాయణకు 444ఓట్లు, బైండ్ల నర్సింలుకు 383ఓట్లు, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి మేకల శ్రీనివాస్‌కు 147, గణ సురక్ష పార్టీ అభ్యర్థి చిన్న మాణిక్యంకు 129ఓట్లు, ఎంబీటీ నుంచి పోటీ చేసిన కిరణ్‌కుమార్‌కు 116ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసిన 8 మంది అభ్యర్థలకంటే ఎక్కువగా నోటాకు 1,423 ఓట్లు రావటం గమనర్హం.

పార్టీ పోలైన ఓట్లు

కాంగ్రెస్‌ 969

బీఆర్‌ఎస్‌ 375

బీజేపీ 569

బీఎస్పీ 33

నోటా 11

పోస్టల్‌లో పై‘చేయి’

33,532 నుంచి 268కి పడిపోయిన ఆధిక్యం

సొంత మండలం, స్వగ్రామంలో మెజార్టీతో హ్యాట్రిక్‌ సాధించిన కాలె యాదయ్య

Advertisement
Advertisement