చట్టాలపై అవగాహనతో మోసాలకు చెక్‌ | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహనతో మోసాలకు చెక్‌

Published Mon, Dec 25 2023 6:36 AM

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డీటీ వెంకటేశ్‌ ప్రసాద్‌  - Sakshi

షాద్‌నగర్‌: చట్టాలపై అవగాహన పెంపొందించుకుంటే మోసాలను అరికట్టవచ్చని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిఽధిలోని చటాన్‌పల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో వినియోగదారుల హక్కులు, విలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టాల గురించి తెలుసుకోవాలని తెలిపారు. ఎలాంటి కొనుగోళ్లు, లావాదేవీలు చేసినా విధిగా బిల్లులను తీసుకోవాలని సూచించారు. గ్యారంటీ, వారంటీ ద్వార లబ్ధి పొందాలకునే వారు ఇన్వాయిస్‌, ఇతర బిల్లులను చూపించాల్సి ఉంటుందన్నారు. వినియోగదారుల హక్కులకు చట్టపరంగా రక్షణ ఉంటుందని చెప్పారు. వినియోగదారుల హక్కు చట్టం 2019 ద్వారా న్యాయం పొందొచ్చన్నారు. కొనుగోలు చేసిన వస్తువుల్లో లోపాలు ఉన్నప్పుడు, వ్యాపారులు మోసం చేసినప్పుడు వారిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. తద్వార పరిహారాన్ని కోరే అవకాశం ఉంటుందన్నారు. వీటితో పాటు వినియోగదారులు తమ హక్కులకు సంబంధించిన పూర్తి వివరాలపై అవగాహన పెంపొందించుకుంటే వ్యాపారులు చేసే మోసాలను అరికట్టవచ్చని ఆయన వివరించారు. దుకాణాల్లో వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించాలని, లేని పక్షంలో చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వినియోగదారుల సమాఖ్య ఫోరం సభ్యుడు నక్క బాల్‌రాజ్‌, గ్యాస్‌ డీలర్‌ దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ వెంకటేశ్‌ ప్రసాద్‌

Advertisement
Advertisement