ప్రాణం తీసిన పొగమంచు | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన పొగమంచు

Published Tue, Dec 26 2023 5:04 AM

- - Sakshi

నందిగామ: పొగమంచు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తెల్లవారు జామున ద్విచక్ర వాహనంపై స్నానానికి వెళ్తున్న ఓ అయ్యప్ప మాలధారుడిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని చాకలిగుట్ట తండా సమీపంలో జేపీ దర్గా రోడ్డులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా.. చాకలిగుట్ట తండా గ్రామ పంచాయతీ పరిధిలోని తాటిగడ్డ తండాకు చెందిన జటావత్‌ సురేందర్‌నాయక్‌(40) ఇటీవల అయ్యప్ప మాలధరించాడు.

గ్రామ సమీపంలోని ఓ దేవాలయ ఆవరణలో సన్నిదానం ఏర్పాటు చేసుకొని పూజలు చేసుకుంటూ తోటి అయ్యప్ప మాలధారులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున స్నానం చేసేందుకు దర్గా రోడ్డులోని ఇంటికి తన ద్విచక్రవాహనం (స్కూటీ)పై వెళ్తున్నాడు. అప్పటికే దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంది.

వాహనాలు ఏ మాత్రం కనిపించలేని పరిస్థితి. స్కూటీపై వెళ్తున్న సురేందర్‌నాయక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనం రోడ్డు పక్కన పడిపోగా సురేందర్‌ నాయక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, తండావాసులు, తోటి అయ్యప్ప మాలధారులు, ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైయ్యారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. మృతుడి భార్య సుమిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు త్వరలోనే వాహనాన్ని గుర్తించనున్నట్లు వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement