స్వచ్ఛతే లక్ష్యం.. సహకారమే ముఖ్యం | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతే లక్ష్యం.. సహకారమే ముఖ్యం

Published Wed, Oct 4 2023 7:50 AM

‘ఫోన్‌ ఇన్‌’లో సమస్యలు తెలుసుకుంటున్న మున్సిపల్‌ కమిషనర్‌ పాతూరి గణేశ్‌రెడ్డి - Sakshi

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
● దోమల నివారణకు రోజూ ఫాగింగ్‌ ● వార్డుల్లో నిరంతరం పర్యవేక్షణ ● పందులు, కుక్కల బెడదపై నజర్‌ ● మున్సిపల్‌ కమిషనర్‌ పాతూరి గణేశ్‌రెడ్డి ● సాక్షి.. ఫోన్‌ ఇన్‌కు విశేష స్పందన

‘దుబ్బాక మున్సిపాలిటీని ప్రజలు.. పాలక మండలి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దు తున్నాం.. స్వచ్ఛతపై ఇప్పటికే అన్ని వార్డుల్లో అవగాహన కల్పించాం. వార్డుల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే డ్రైనేజీ, రోడ్లు, నీటి సమస్యను పరిష్కరానికి చర్యలు తీసుకుంటున్నాం. దోమలు, పందుల సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి.. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారులు, సిబ్బందికి ఆదేశాలిస్తాం. ప్రజలు కూడా స్వచ్ఛ దుబ్బాకకు సహకరించాలి’ అని మున్సిపల్‌ కమిషనర్‌ పాతూరి గణేశ్‌రెడ్డి తెలిపారు. – దుబ్బాకటౌన్‌

దుబ్బాక మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం ‘సాక్షిఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు చేపట్టిన ఫోన్‌ ఇన్‌కు ఆయా వార్డుల నుంచి కాల్స్‌ వచ్చాయి. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, దోమలు, పందుల బెడద, రహదారుల నిర్మాణం, విష జ్వరాలు, తదితర సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్‌ గణేశ్‌రెడ్డి నోట్‌ చేసుకుంటూ పరిష్యారానికి చేపడుతున్న మార్గాలపై వివరించారు. సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించి వెంటనే పరిష్కరించాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

బాలాజీనగర్‌ 16వ వార్డులోని మురికి గుంతల్లో దోమలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో రోగాల బారిన పడుతున్నాం.

– మాడవైన శ్రీకాంత్‌

కమిషనర్‌: డ్రైనేజీ నీరు నిలవకుండా వెంటనే చర్యలు చేపడతాం. సిబ్బందిని అక్కడికి పంపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

మున్సిపాలిటీలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. రామసముద్రం కట్ట వద్ద నిర్వహణలేక టాయిలెట్స్‌ అధ్వానంగా మారాయి. – గోనె మధు

కమిషనర్‌: దోమల నివారణకు ఫాగింగ్‌తో పాటు యాంటీ లార్వా మందులను తప్పకుండా స్ప్రే చేపిస్తాం. టాయిలెట్స్‌ శుభ్రం చేసేలా సిబ్బందిని నియమిస్తాం.

14వ వార్డులో మురుగు కాలవలు శుభ్రం చేయడంలేదు. పందులు, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం.

– రాజేష్‌, నీలకంఠ యువజన సంఘం అధ్యక్షుడు

కమిషనర్‌: వెంటనే మా సిబ్బందిని పంపించి డ్రైనేజీలు శుభ్ర పర్చడమేకాక, పందులు, దోమల బెడద నివారణకు చర్యలు తీసుకుంటాం.

మూడు రోజులకోసారి సైతం చెత్త బండి రావడంలేదు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా పట్టించుకోరు.. దృష్టి సారించండి.

– గౌసొద్దీన్‌, 12వ వార్డు, మల్లాయపల్లిరోడ్డు

కమిషనర్‌: మీరు చెప్పిన విషయాన్ని నోట్‌ చేసుకున్నాం. సంబంధిత అధికారిని పంపిస్తాం. వెంటనే చర్యలు చేపడతాం.

పారిశుద్ధ్యం కార్మికులు వీధుల్లోకి రావడంలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. చర్యలు తీసుకోండి.

– శ్రీనివాస్‌, సాదత్‌ అలీ దుంపలపల్లి,

వినయ్‌ భాస్కర్‌ దుబ్బాక హన్మాన్‌ గుడి

కమిషనర్‌: పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా రాకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం.

పట్టణంలోని 18వ వార్డు గ్యాస్‌ ఆఫీస్‌ సమీపంలో పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఇబ్బందులు తప్పడంలేదు.

–రామకృష్ణ పంతులు

కమిషనర్‌: మా సిబ్బందిని పంపించి గడ్డిని, పిచ్చిమొక్కలు తొలగిస్తాం. ఇబ్బందులు లేకుండా చూస్తాం.

డబుల్‌ బెడ్రూంల మురికి నీరంతా మా పొలంలోకి వస్తోంది. దీంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. చర్యలు తీసుకోండి.

– కిష్టంగారి శ్రీనివాస్‌రెడ్డి, దుబ్బాక 19వ వార్డు

కమిషనర్‌: డ్రైనేజీ నీరు సక్రమంగా బయటకు వెళ్లేలా శాశ్వత మార్గాలను చేపడతాం.

17వ వార్డులో దారులు అధ్వానంగా మారాయి. నడవడానికి సైతం వీలులేకుండా ఉన్నాయి. ఇబ్బందులు తప్పడంలేదు. – శ్రీరాం నరేందర్‌

కమిషనర్‌: తప్పకుండా రోడ్డు సమస్యను పరిష్కరిస్తాం. 18వ వార్డులో చిల్డ్రెన్స్‌ పార్క్‌కు నిధులు మంజూరు అయ్యాయి. త్వరలోనే పనులు చేపడతాం.

లచ్చపేటలో పందులు ఇళ్ల మధ్యే తిరుగుతున్నాయి. రోగాలు విజృంభిస్తున్నాయి. సమస్యను పరిష్కరించండి.

– అల్తాఫ్‌, ఇస్తారిగల్ల స్వామి, షాహెద,

11వ వార్డు లచ్చపేట

కమిషనర్‌: సమస్యను నోటు చేసుకున్నా. వెంటనే సంబంధిత అధికారిని, సిబ్బందిని పరిష్కారానికి చర్యలు చేపడతాం.

మా ఇంటి వద్ద ఆవులను కట్టేస్తున్నారు. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పటికై నా చర్యలు తీసుకోండి. – సుధాకర్‌రెడ్డి, చేర్వాపూర్‌

కమిషనర్‌: ఆవుల యజమానికి నోటీసులు జారీ చేశాం. తొలగించకుంటే షెడ్డును తొలగించేలా చర్యలు తీసుకుంటాం.

డెంగీ, వైరల్‌ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నాం. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి. – భాస్కర్‌, సీపీఎం నాయకుడు

కమిషనర్‌: ఇంటింటికీ వెళ్లి పారిశద్ధ్యంపై అవ గాహన కల్పిస్తున్నాం. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలు సిబ్బందికి సహకరించాలి.

డబుల్‌ బెడ్రూం కాలనీల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. మురికినీరు నిలవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది.

– పాష, డబుల్‌ బెడ్రూం 38వ బ్లాక్‌

కమిషనర్‌: డబుల్‌ బెడ్రూంల వద్ద డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

ఫోన్‌ ఇన్‌
1/2

ఫోన్‌ ఇన్‌

2/2

Advertisement
Advertisement