Telangana News: ఆలు వైపు.. రైతుల ముందస్తు చూపు
Sakshi News home page

ఆలు వైపు.. రైతుల ముందస్తు చూపు

Published Wed, Oct 4 2023 7:50 AM

- - Sakshi

ఆలుగడ్డ పంట ముందస్తు సాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పంట సాగుకు నవంబర్‌ మొదటి వారం అనుకూలంగా ఉంటుంది. అయినా వారు అప్పటి వరకు వేచి చూడకుండా పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో పంట వేసుకున్న రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాక నష్టపోయారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో ఆలుగడ్డ పంట వేసుకున్న వారికి మార్కెట్లో మంచి ధర పలికి కాసుల వర్షం కురిసింది. దీంతో ఈ సారి ముందస్తు సాగువైపే మొగ్గుచూపుతున్నారు.

– జహీరాబాద్‌

స్వల్పకాలిక పంట కావడం, నీటి తడులు అంతగా అవసరం ఉండక పోవడం వల్ల ముందస్తు సాగు వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. 80–90 రోజుల మధ్య కాలంలో పంట చేతికి అందివస్తుంది. మడుల విధానంలో పంటను తీసే సమయంలో 20 రోజుల ముందే నీటి తడులను ఆపేస్తారు. పంట వేసిన సమయంలో మొదటి తడి ఇచ్చాక 20 రోజుల వరకు నీటి తడులు అవసరం ఉండదు.

గత ఏడాది కంటే ఈ ఏడాది రెండువేల ఎకరాల్లో సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో పంట సాగయింది. ప్రతిఏటా 90 శాతం మేర జహీరాబాద్‌ నియోజకవర్గంలోనే పంట సాగవుతోంది. సాగుకు అనువైన నేలలు ఉండడం వల్లే రైతులు ఆలుగడ్డ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గంలోని కోహీర్‌తో పాటు జహీరాబాద్‌, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లో రైతులు ఆలు పంట సాగు చేశారు.

నీరు పుష్కలంగా ఉండటం వల్లే..
ఈ ఏడాది అధికంగా వర్షాలు పడడం వల్ల వ్యవసాయ బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. గతంలో నీరు లేక పాడుబడిన బావులు కూడా తిరిగి వినియోగంలోకి వచ్చాయి. దీంతో ఆలుగడ్డ పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది కంటే సాగు పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.

గత ఏడాది మంచి గిట్టుబాటు ధర
గత ఏడాది ఆలుగడ్డ పంటను సాగు చేసుకున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించింది. ఈ ఏడాది కూడా అదే ఆశతో పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ఎకరం పంట సాగుపై పెట్టుబడులు పోను రూ.50 నుంచి రూ.70వేలు లాభం వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు.

జోరుగా విత్తన కొనుగోళ్లు..
రైతులు వ్యాపారుల వద్ద నుంచి ఆలుగడ్డ విత్తనం కొనుగోలు చేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రా నుంచి పలువురు వ్యాపారులు ఈ విత్తనాలను తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. క్వింటాలు విత్తనం ధర రూ.2 వేలు నుంచి రూ.2,600 కు అమ్ముతున్నారు.

రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం స్థానికంగా కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేసినట్లయితే విత్తనం అందుబాటులో ఉండే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.

పది ఎకరాల్లో సాగు
వారం రోజుల్లో ఆలుగడ్డ పంట సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. వర్షాలు తగ్గిపోవడంతో దుక్కులు దున్నే పనులను ఆరంభించా. సుమారు 10 ఎకరాల్లో సాగుచేస్తున్నా. మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంది. అందుకే ముందస్తు వైపు ఆసక్తి చూపుతున్నా. ప్రస్తుతం వాతావరణం ముందస్తు సాగుకు అనుకూలంగా ఉంది.  –ఎన్‌.అంజిరెడ్డి, రైతు, పైడిగుమ్మల్‌

దుక్కులు సిద్ధం చేసుకుంటున్న..
ఆలుగడ్డ పంట సాగుకు దుక్కి దున్నే పనులు ప్రారంభించా. ప్రస్తుతం వర్షాలు ఆగిపోవడంతో రైతులంతా ఈ సాగు కోసం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సుమారు మూడు ఎకరాల్లో పంటను వేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాను.  –కె.స్వరూప్‌రెడ్డి, రైతు, కోహీర్‌

Advertisement
Advertisement