పొన్నం వర్సెస్‌ అల్గిరెడ్డి.. ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా? | Sakshi
Sakshi News home page

పొన్నం వర్సెస్‌ అల్గిరెడ్డి.. ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా?

Published Thu, Oct 26 2023 7:52 AM

- - Sakshi

సాక్షి, మెదక్‌: కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్ల కేటాయింపులో మొదటి లిస్ట్‌లో హుస్నాబాద్‌కు చోటు ఇవ్వలేదు. రేపో మాపో రెండో లిస్ట్‌ విడుదల చేసే అవకాశం ఉంది. టికెట్‌ ఖరారు కాకముందే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. టికెట్‌ నాకే అంటే నాకే అని ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ పోతున్నారు. – హుస్నాబాద్‌

హైదరాబాద్‌లోని తక్కుగూడలో జరిగిన రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీ విజయభేరికి ఎవరికి వారే వాహనాల్లో కార్యకర్తలను తరలించారు. పార్టీ కార్యాలయాలను సైతం ప్రారంభించారు. ‘తిరగబడుదాం..తరిమికొడదాం’ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వి. హన్మంతరావు పాల్గొనగా, పొన్నం ప్రభాకర్‌, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఇద్దరూ పాల్గొన్నారు. దీని తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేదుకు నిర్వహించి సమావేశానికి ఏఐసీసీ సభ్యుడు మోహన్‌ ప్రకాశ్‌ రాగా, రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.

దీంతో కాంగ్రెస్‌ పార్టీలో రెండు గ్రూపులుగా ఏర్పడడం కార్యకర్తల్లో అయోమయానికి గురి చేసింది. కాంగ్రెస్‌, సీపీఐ పొత్తులో భాగంగా హుస్నాబాద్‌ టికెట్‌ తమకే కేటాయించాలని సీపీఐ పార్టీ ఒత్తిడి తెస్తోంది. ఈ రెండు మూడు రోజుల నుంచి సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్‌ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుండడంతో, హుస్నాబాద్‌ సీటు కాంగ్రెస్‌కే కేటాయిస్తారనే భావనతో టికెట్‌ కోసం పొన్నం ప్రభాకర్‌, ప్రవీణ్‌రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

చలో కాళేశ్వరం..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోయిందని, ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు చూపేందుకు పొన్నం ప్రభాకర్‌ చలో కాళేశ్వరం పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలానికి ఒక బస్సు చొప్పున రైతులు, కాంగ్రెస్‌ నాయకులతో కాశేశ్వరానికి తరలివెళ్లారు. అలాగే మార్నింగ్‌ వాక్‌ పేరిట ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను ప్రచారం చేస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇటీవలె కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రచార రథాలకు పూజలు చేయించి ప్రతి రోజూ ప్రచారం చేయిస్తున్నారు.

చాపకింది నీరులా ప్రచారం..
మరో వైపు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి చాపకింద నీరులా ప్రచారం ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని దాదాపు 90 గ్రామాలను చుట్టిముట్టి కాంగ్రెస్‌ ఆరు గ్యా రెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఊరు ఊరునా పరామర్శల పేరిట ఇంటింటికీ వెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. టికె ట్‌ తనకే వస్తుందనే ధీమాతో కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో బుధవారం ప్రచ ార రథాలకు పూజలు నిర్వహించారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా?
కాంగ్రెస్‌ అధిష్టానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా మరొకరి మద్దతు ఉంటుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరు నేతలు ఎందులోనూ తగ్గకుండా సీరియస్‌గా ఎవరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా చేస్తున్నారు. టికెట్‌ వచ్చిన తర్వాత ఇద్దరు చేతులు కలుపుతారా లేదా చేయి ఇస్తారా అనేది అంతుపట్టని పరిస్థితి నెలకొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement