నామినేషన్ల దాఖలు | Sakshi
Sakshi News home page

నామినేషన్ల దాఖలు

Published Mon, Nov 6 2023 4:39 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కొన్ని అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ వీడటం లేదు. నామినేషన్లకు గడువు దగ్గరకొస్తున్నప్పటికీ ఇంకా కాంగ్రెస్‌ టికెట్లు ఖరారు కావడం లేదు. జిల్లాలో సంగారెడ్డి, అందోల్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాలకు టికెట్లు ఖరారయ్యాయి. పటాన్‌చెరు, నారాయణఖేడ్‌ స్థానాలపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది. వీటిని ఆశిస్తున్న నేతలు ఎవరికి వారే గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఖేడ్‌లో పీసీసీ ఉపాధ్యక్షులిద్దరూ సురేష్‌ షెట్కార్‌, డాక్టర్‌ సంజీవరెడ్డి.. పట్టు వీడటం లేదు. ఇటు పటాన్‌చెరు విషయంలోనూ ఇంతే. ఇటీవల ఆ పార్టీలో చేరిన నీలం మధు, కాటా శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు చోట్ల పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తేలాల్సి ఉంది. కాగా ఆశావహులు ఢిల్లీలోనే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలకు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు.

నామినేషన్ల దాఖలు

నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. పలువురు అభ్యర్థులు నామినేషన్లు సైతం దాఖలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ రెండు టికెట్లపై స్పష్టత రాకపోవడంతో ఇటు కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం ఉంది. కాగా బీఆర్‌ఎస్‌ మాత్రం సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను ఎప్పుడో ప్రకటించింది. ఇప్పటికే వారు రెండు, మూడు దఫాలు నియోజకవర్గాలను చుట్టేశారు. కానీ ఈ రెండు స్థానాల్లో అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో ఎప్పుడు ప్రచారం చేయాలో? ఓటర్లను ఎప్పుడు కలువాలో? తెలియని పరిస్థితి నెలకొందనే కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

నేడో, రేపో ప్రకటన

ఒకట్రెండు రోజుల్లో పటాన్‌చెరు, నారాయణఖేడ్‌ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయానికి వదిలేశారని తెలుస్తోంది.

న్యూస్‌రీల్‌

తేలని ఖేడ్‌, పటాన్‌చెరు టికెట్లు

కాంగ్రెస్‌ పార్టీ ఆశావహుల్లో టెన్షన్‌

ఇప్పటికే మొదలైన నామినేషన్లు

Advertisement
Advertisement