వలసొచ్చి.. వరి నాట్లు వేసి | Sakshi
Sakshi News home page

వలసొచ్చి.. వరి నాట్లు వేసి

Published Tue, Jan 23 2024 6:34 AM

వరి నాట్లు వేస్తున్న పశ్చిమ బెంగాల్‌ కూలీలు - Sakshi

దుబ్బాకటౌన్‌: జిల్లాలో వరి నాట్లు వేయడానికి రైతులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయి. మొత్తం 48 లక్షల ఎకరాల్లో నాట్లు సిద్ధం కావడం వల్ల కూలీల కొరత ఏర్పడింది. ఇప్పటికే సగం వరినాట్లు పూర్తి అయినా మరో 50 శాతం ఉండడంతో ఎకరానికి రోజుకు 8 నుంచి 10 మంది కూలీలు అవసరం పడుతున్నారు. కానీ, నాటు వేయడానికి కూలీలు దొరక్క బిహార్‌, యూపీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పురుష కూలీలతో రైతులు నాట్లు వేయిస్తున్నారు. ఎకరానికి రూ.5,500 వరకు గంపగుత్తగా మాట్లాడుకొని నాట్లు వేస్తున్నారు.  

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కూలి పేరు సిద్దార్థ్‌. సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో పెద్దగా చేసేందుకు ఉపాధి లేకపోవడంతో 30 రోజుల క్రితం ఆయనతోపాటు మరో 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతానికి వచ్చారు. ఇందులో ఒక వ్యక్తి వంటలు చేస్తుండగా మిగతా 12 మంది నాట్లు వేస్తారు. ప్రతి రోజూ 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తామని సిదార్ధ్‌ చెప్పుకొచ్చాడు. గతేడాది ఏపీలో వేశామని, ఈసారి ఆంధ్రాకు చెందిన వ్యక్తి తెలపడంతో ఇక్కడికి వచ్చామని ఇప్పటి వరకు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 130 ఎకరాల వరకు నాట్లు వేశామని చెప్పుకొచ్చాడు.

బెంగాల్‌కు చెందిన 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు ఇక్కడికి వచ్చారు. రైతుల పొలాల్లో నారు తీసి వారే వేసుకొని రోజు 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తున్నారు. పొలాల్లో సన్నటి తాడుతో మునుములు కట్టుకొని చూస్తుండగానే టకటకా నాట్లు వేస్తున్నారు. ఎకరం నాటుకు వీరిని తీసుకొచ్చిన మధ్య వ్యక్తి రైతుల నుంచి రూ.5,500 తీసుకుంటున్నాడు.

ఇందులో నుంచి బెంగాల్‌ కూలీలకు రూ.3,500 ఇస్తూ మిగతా డబ్బులతో వీరు ఉండడానికి వసతి, భోజనాలు, వాహనం తదితర సౌకర్యాలు చూసుకుంటున్నాడు. సాధారణంగా ఇక్కడ మహిళలు ఎకరం నాటుకు రూ.6 వేల వరకు తీసుకుంటుండగా, నారు వేసేందుకు మరో రూ.2,000 పైగా రైతులకు ఖర్చు అవుతుంది. దీంతో ఎకరం నాటుకు రైతుకు రూ. 8 వేలు ఖర్చు అవుతుంది. అదే బెంగాల్‌ కూలీలతో నాటు వేయిస్తే రూ.5,500 మాత్రమే అవుతుంది. ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు రైతులకు ఆదా అవడంతోపాటు కూలీల బాధ తప్పుతుంది.

1.80 లక్షల ఎకరాల్లో పూర్తి..
జిల్లాలో ఈ యాసంగిలో 3.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తారని వ్యవసాయాధికారుల అంచనా ఉంది. ఇప్పటి వరకు 1.80 లక్షల ఎకరాల్లో నాట్లు వేయడం పూర్తి అయ్యింది. ప్రస్తుతం జోరుగా వరినాట్లు పడుతుండడంతో ఈ నెలలోపు నాట్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది.

ఈసారి నాట్లు పెరిగే అవకాశం..
జిల్లాలో ఇప్పటికే సగంకు పైగా వరినాట్లు పూర్తి అయ్యాయి. ఈ యాసంగిలో 3.48 లక్షల ఎకరాల్లో వరినాట్లు అంచనా ఉండగా ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాల వరకు నాట్లు పడ్డాయి. కూలీల కొరతతో రైతులు వెద పద్ధతిలో వేసుకున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలు, నాట్లేసే యంత్రాలు రావడంతో రైతులకు చాలా బాధలు తప్పాయి. ఈ సారి రికార్డు స్థాయిలో వరినాట్లు వేసే అవకాశం ఉంది.
– శివప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
Advertisement