చెల్లింపుల్లో మరింత జాప్యం | Sakshi
Sakshi News home page

చెల్లింపుల్లో మరింత జాప్యం

Published Tue, Jan 30 2024 8:18 AM

- - Sakshi

బకాయిల కోసం ఎదురుచూపు
● ఆస్తులు అమ్మకానికి పెట్టిన ట్రైడెంట్‌ యాజమాన్యం ● అగ్రిమెంట్‌ వ్యవహారం తేలక కోర్టులో కేసు ● ఆందోళనలో చెరకు రైతులు

ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారం

జహీరాబాద్‌: ట్రైడెంట్‌ యాజమాన్యం బకాయిలు చెల్లించక చెరకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు ఇవ్వడంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్‌ మండలం కొత్తూర్‌(బి) గ్రామశివారులోని ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారం యాజమాన్యం రైతులకు 2022–23 క్రషింగ్‌ సీజన్‌కు సంబంధించిన బకాయిలు రూ.9కోట్ల మేర పెండింగ్‌లో పెట్టింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ విషయంలో యాజమాన్యంపై ఒత్తిడి తేవడంతో విడతల వారీగా బిల్లులు చెల్లించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సీరియస్‌ కావడంతో కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టి బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు దాని ఊసేలేదు. గత క్రషింగ్‌ సీజన్‌లో యాజమాన్యంతో వినోద్‌బేడ్‌ ఒప్పందం కుదుర్చుకుని క్రషింగ్‌ను చేపట్టారు. తన ఒప్పందం ఇంకా తేలకముందే కర్మాగారం ఆస్తులు ఎలా అమ్ముతారంటూ కోర్టును ఆశ్రయించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. దీంతో వేలం వేసే విషయంలో జాప్యం జరుగుతుందని తెలిసింది.

ఆస్తుల వేలానికి నోటీసులు

బకాయిలు చెల్లింపుల్లో జాప్యం చేస్తుండడంతో కర్మాగారం ఆస్తుల వేలానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ యాక్ట్‌ చట్టం అమలు చేసి వేలం ద్వారా వచ్చిన డబ్బులు రైతులకు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్‌ 11వ తేదీన యాజమాన్యానికి తహసీల్దార్‌ నోటీసులు ఇచ్చారు. జనవరి 10న బహిరంగ వేలం వేయనున్నట్లు ఫారం నెంబర్‌–7 ద్వారా పేర్కొన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఖరారు చేసిన తేదీ పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు.

ఈ సీజన్‌లో క్రషింగ్‌ లేనట్లే

ట్రైడెంట్‌ కర్మాగారాన్ని పలు సమస్యలు చుట్టుముట్టడంతో 2023–24 సీజన్‌కుగాను క్రషింగ్‌ను నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. అధికారులు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. జహీరాబాద్‌ జోన్‌ పరిధిలో సుమారు 18వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. 7లక్షల టన్నుల మేర పంట ఉత్పత్తి కానుంది. రైతులు కర్ణాటక రాష్ట్రంలోని చించోళి, బరూర్‌, మన్నాక్కెల్లి, గాంధీ చక్కెర కర్మాగారాలకు పంటను తరలిస్తున్నారు. కొందరు దళారులకు అమ్ముకుంటున్నారు.

హామీ మరిచిన నేతలు

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్మాగారంలో క్రషింగ్‌ను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, బకాయిలు ఇప్పిస్తామని రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. నవంబర్‌ 21న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌, నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి దేవిప్రసాద్‌లు తమ సొంత ఆస్తులు అమ్మి అయినా బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారు. వారిప్పుడు ఎక్కడ పోయారని రైతులు ప్రశ్నిస్తున్నారు. మాణిక్‌రావు ఎమ్మెల్యేగా గెలుపొందినా సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్‌ సైతం డిసెంబర్‌ మొదటి వారంలోనే క్రషింగ్‌ జరిపించేలా చూస్తానని చెప్పారని రైతులు గుర్తు చేస్తున్నారు.

రివైజ్డ్‌ నోటీసు ఇచ్చాం

బకాయిలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాజమాన్యంతో ఒప్పందం చేసుకుని గత సీజన్‌లో క్రషింగ్‌ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన వినోద్‌బేడ్‌ అగ్రిమెంట్‌ ఇంకా తేలలేదు. కర్మాగారం అమ్మవద్దని వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం రివైజ్డ్‌ నోటీసు ఇచ్చాం.

– రాజశేఖర్‌,

కేన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, సంగారెడ్డి

సిఫారసు కమిటీలో చంద్రశేఖర్‌కు స్థానం

నిజాం షుగర్స్‌ లిమిటెడ్‌ కర్మాగారాలను పునఃప్రారంభించే విషయంలో ప్రభుత్వం వేసిన సిఫారసుల కమిటీలో జహీరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఏ.చంద్రశేఖర్‌కు స్థానం దక్కింది. అలాగే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మెదక్‌ జిల్లా ముంబోజిపల్లితో పాటు మెట్‌పల్లి, బోధన్‌లో మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఫారసుల కమిటీని వేసింది. ఇందులో మంత్రి దామోదర రాజనర్సింహ కోచైర్మన్‌గా ఉన్నారు. మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిలను సైతం సభ్యులుగా చేర్చారు.

1/2

2/2

Advertisement
Advertisement