ఉజ్వల భవిష్యత్‌కు సాంకేతిక విద్య | Sakshi
Sakshi News home page

ఉజ్వల భవిష్యత్‌కు సాంకేతిక విద్య

Published Sat, Mar 23 2024 8:05 AM

పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రయోగం చేస్తున్న విద్యార్థులు (ఫైల్‌) - Sakshi

● వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ● పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ● పదవ తరగతి ఉత్తీర్ణతతో అర్హత ● మే 24న పరీక్ష

సంగారెడ్డి టౌన్‌: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు పాలిటెక్నిక్‌ బాటు వేస్తుంది. పదవ తరగతి పూర్తి చేసుకోనున్న విద్యార్థులు సాంకేతిక విద్యాభ్యాసంలో అడుగు పెట్టి, ఉన్నతస్థాయి చేరుకోవడానికి పాలిటెక్నిక్‌ విద్య ఎంతో దోహదపడుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో త్వరగా ముందడుగు వేయడానికి.. జీవితంలో స్థిర పడటానికి పాలిటెక్నిక్‌ ఒక చక్కని ఉపాధిగా నిలవబోతోంది. ఈ విద్యా సంవత్సరానికి గాను పాలిసెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఏప్రిల్‌ 24 వరకు తుది గడువు నిర్ణయించారు.

పదవ తరగతిలో ఉత్తీర్ణ సాధించిన వారు పాలిసెట్‌ చదవడానికి అర్హత సాధిస్తారు. ప్రస్తుతం పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. www.polycet.sbset.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులు రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాలి. గణితం, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. నీటిపారుదల, ప్రజా వైద్యం, ఇంజినీరింగ్‌, రోడ్డు, భవనాలు, ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థల్లో, వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కార్పొరేట్‌ సంస్థలు, పరిశ్రమల్లోనూ ఉద్యోగాలు ఉంటాయి. పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేసి ప్రవేశ పరీక్ష ద్వారా బీటెక్‌ నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చు.

సీట్ల వివరాలు :

సంగారెడ్డి, జోగిపేట బాలికల, నారాయణఖేడ్‌ కళాశాలలు ఒక్కో దానిలో 120 సీట్ల చొప్పున ఉన్నాయి. రంజోల్‌లో 420, జోగిపేటలో 180 ఉన్నాయి. మెదక్‌ మహిళ, చేగుంట, గోమారం (నర్సాపూర్‌)లోని కళాశాలల్లో 120 సీట్ల చొప్పున ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని ఆరు కళాశాలల్లో 1,020 ఉన్నాయి.

సద్వినియోగం చేసుకోవాలి

పాలిసెట్‌ను గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు పూర్తి చేసిన వారికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది. బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉండటం ప్రత్యేకత. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– శ్రీనివాసులు ప్రిన్సిపాల్‌,

సంగారెడ్డి పాలిటెక్నిక్‌ కళాశాల

1/1

Advertisement
Advertisement