ప్రమాదమా.. ఎవరైనా చేశారా? | Sakshi
Sakshi News home page

ప్రమాదమా.. ఎవరైనా చేశారా?

Published Thu, Jun 1 2023 3:18 AM

డీఆర్‌సీసీ ప్రమాదంలో మంటలను ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బంది(ఫైల్‌)  - Sakshi

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని డ్రై రీసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్‌ (డీఆర్‌సీసీ) జరిగిన అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే చర్చ సాగుతోంది. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డుకాలనీ డీఆర్‌సీసీలో మే 27న అగ్నిపమాదం జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఎవరైనా సిగరేట్‌, బీడీ తాగి పడేస్తే జరిగిందా.. అని చర్చ జరుగుతోంది.

30లక్షల ఆస్తి నష్టం

● మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రతిరోజు వెలువడే తడి, పొడి చెత్తను పారిశుధ్య సిబ్బంది వేర్వేరుగా సేకరిస్తుంటారు.

● తడి చెత్తను బుస్సాపూర్‌ యార్డుకు తరలించి ఎరువు, గ్యాస్‌గా తయారు చేస్తున్నారు.

● మంగళ, శుక్ర వారాల్లో సేకరించిన పొడి చెత్తను హౌసింగ్‌ బోరుకాలన్డీలో డీఆర్‌సీసీకి తరలిస్తారు.

● ఈ సెంటర్‌ నిర్వహణను ఓ సంస్థకు అప్పగించి, 32 రకాలుగా చెత్తను విభజించి విక్రయిస్తున్నారు.

● మే 27న అగ్నిప్రమాదంలో ఒక డీసీఎం, లోడర్‌, రెండు బెలింగ్‌ మిషన్‌లు, 2 ల్యాప్‌టాప్‌లు, వేయింగ్‌ స్కేల్‌, కన్వెయర్‌ బెల్ట్‌, రూ.10లక్షల విలువ చేసే ప్లాస్టిక్‌, ఇతర మెటీరియల్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి.

● ఈ ప్రమాదంలో సుమారుగా రూ.30లక్షల నష్టం జరిగింది.

● స్థానికులు, ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

● డీసీఎం నుంచి వచ్చే నిప్పులతో ప్రమాదం జరిగి ఉండవచ్చని చెబుతున్నా.. అలా అయితే అంతపెద్ద ప్రమాదం జరగదని, అందులో పని చేసే కార్మికులు ఎవరైనా సిగరేట్‌, బీడి తాగి పడేస్తే జరిగి ఉండవచ్చని చర్చించుకుంటున్నారు.

నిబంధనలు గాలికి..

డీఆర్‌సీసీలో ఫైర్‌ సెఫ్టీ నిబంధనలు పాటించినట్లు తెలియడంలేదు. నాలుగు ఎక్ట్సింగ్‌ విషర్‌ మాత్రమే ఉండగా, కనీసం వాటిని ఎలా వినియోగించాలో తెలియక సిబ్బంది వాటి వైపు చూడలేదు. స్క్రాబ్‌ గోదాంగా డీఆర్‌సీసీని పరిగణిస్తారు. ఇలాంటి చోట ఫైర్‌ సెఫ్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా ఒక వాటర్‌ ట్యాంకర్‌, పోర్టబుల్‌ పంప్‌, ఎక్ట్సింగ్‌విషర్‌లు ఉండాలి. అందులో పని చేసే సిబ్బందికి అగ్నిప్రమాదం జరిగినప్పుడు స్పందించాల్సి అంశాలపై అవగాహన కల్పించాలి. ఇలాంటివేవి డీఆర్‌సీసీలో కనబడడంలేదనే ఆరోపణలున్నాయి.

స్పార్క్‌తోనే మంటలు

డీసీఎంలో వచ్చిన స్పార్క్‌తో ప్లాస్టిక్‌ కవర్‌లు అంటుకున్నాయి. దీంతో ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. మున్సిపాలిటీకి ఎలాంటి నష్టం జరగలేదు. నిర్వహణ బాధ్యత ప్రవేట్‌ సంస్థ చూస్తోంది. ప్రమాద కారణాలపై విచారణ చేస్తాం.

– సంపత్‌ కుమార్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, సిద్దిపేట

అగ్నిప్రమాదంపై అనుమానాలు

సుమారుగా రూ.30లక్షల ఆస్తి నష్టం

డీఆర్‌సీసీలో కనబడని ఫైర్‌ సెఫ్టీ

Advertisement

తప్పక చదవండి

Advertisement