ఐదేళ్ల నిరీక్షణకు తెర | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల నిరీక్షణకు తెర

Published Thu, Jun 8 2023 3:48 AM

నంద్యాలలో గొర్రెలను కొనుగోలు చేస్తున్న లబ్ధిదారులు, అధికారులు  - Sakshi

9 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

జిల్లాలో 412 సంఘాలు..32,452 మంది సభ్యులు

మొదటి విడతలో 15,720 మందికి పంపిణీ

రెండో విడతలో 16,732 మంది లబ్ధిదారులకు అందజేత

సాక్షి, సిద్దిపేట: గొర్రెల పెంపకందారుల నిరీక్షణకు తెరపడనుంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సంక్షేమ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెంపకందారులకు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017, జూన్‌లో మొదటి విడత పంపిణీ చేశారు. రెండో విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గొర్రెల పంపిణీకి జూన్‌9న రంగం సిద్ధం చేశారు.

రెండో విడతలో 16,732 మందికి పంపిణీ

● జిల్లాలో మొత్తం 412 ప్రాథమిక గొర్రెల పెంపక సహకార సంఘాలు ఉండగా, ఇందులో 32,452మంది సభ్యులు ఉన్నారు.

● 2017సంవత్సరంలోనే పంపిణీ చేయాల్సిన దాన్ని విడతల వారీగా ఎంపిక చేశారు.

● మొదటి విడతలో 15,720, రెండో విడతలో 16,732 మందికి పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి విడత పంపిణీ చేసినప్పుడే రెండో విడత పంపిణీ ఉంటుందని గొర్రెల పెంపకందారులు ఎదురు చూసి ఆశలు వదులుకున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గొర్రెల పెంపకందారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

యూనిట్‌ ధర పెంపు

ప్రభుత్వం గొల్లకురుమలకు 75శాతం సబ్సిడీ కింద ఒక యూనిట్‌కు 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు పంపిణీ చేస్తోంది. 2017లో ఒక్కో యూనిట్‌కు రూ.1,25,000 నిర్ణయించారు. అందులో లబ్ధిదారుడు రూ.31,250 డీడీ ద్వారా ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చే రూ.1.25లక్షలతో 21 గొర్రెలు రాకపోవడంతో మరో రూ.50 వేలు పెంచుతూ యూనిట్‌ ధరను రూ.1.75లక్షలుగా నిర్ణయించారు. రెండో విడతలో 16,732 మందికి గాను ఇప్పటి వరకు సబ్సిడీ పోను మిగతా డబ్బులు 5,756మంది డీడీలు కట్టారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఏపీలోని కర్నూల్‌ జిల్లా, కర్ణాటకలోని బళ్లారిలో కొనుగోలు చేయాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ ఆదేశించింది. ఈ నెల 9న మొదటి రోజు ప్రతీ నియోజకవర్గంలో ఆరుగురికి చొప్పున గొర్రెలు, మరో పది మందికి మంజూరు పత్రాలు అందజేసేందుకు పశుసంవర్థక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం సిద్దిపేట నియోజకవర్గం నుంచి మల్యాలకు చెందిన ఆరుగురు, గజ్వేల్‌ నుంచి సిరిగిరిపల్లి, దుబ్బాక హబ్సిపూర్‌, హుస్నాబాద్‌ పందిళ్లకు చెందిన ఆరుగురు చొప్పున కర్నూల్‌కు వెళ్లారు. ప్రత్యేక అధికారిగా మైన్స్‌ ఏడీ రాఘవరెడ్డి నేతృత్వంలో 24 మంది లబ్ధిదారులు వెళ్లారు.

9న గొర్రెల పంపిణీ

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 9న రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ చేసేలా సన్నాహాలు చేస్తున్నాం. గొర్రెల కొనుగోలుకు పలుటీంలు కర్నూల్‌కు వెళ్లాయి.

– జగత్‌ కుమార్‌,

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

Advertisement
Advertisement