TS Siddipet Assembly Constituency: ఇక్కడ గెలిచే పార్టీదే అధికార పీఠం!
Sakshi News home page

TS Election 2023: ఇక్కడ గెలిచే పార్టీదే.. అధికార పీఠం!

Published Tue, Aug 22 2023 6:08 AM

- - Sakshi

సిద్ధిపేట్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముచ్చటగా మూడోసారి గజ్వేల్‌ ‘బరి’లోకి దిగుతున్నారు. ‘సెంటిమెంట్‌’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇదే ఆనవాయితీని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి పోటీ చేసిన సందర్భంలో మొత్తం 1,99,062 ఓట్లు పోలవగా, ఇందులో కేసీఆర్‌ 86,372 ఓట్లను దక్కించుకున్నారు.

టీడీపీకి చెందిన తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 19,218 ఓట్ల మెజార్టీ సాధించారు. ప్రతాప్‌రెడ్డికి మొత్తం 67,154 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కేవలం 33,998 ఓట్లకే పరిమితమయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో కేసీఆర్‌కు మొత్తంగా 1,25,444 ఓట్లు వచ్చాయి. కేసీఆర్‌కు ప్రత్యర్థిగా ఉన్న వంటేరు ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్‌) 2014 ఎన్నికల మాదిరిగానే 67,154 ఓట్లు రావడం గమనార్హం. ఈ లెక్కన ప్రతాప్‌రెడ్డిపై 58,290 ఓట్ల మెజార్టీ వచ్చింది.

ఇక్కడ గెలిచే పార్టీదే అధికార పీఠం!
1952లో జరిగిన ఎన్నికల్లో మినహా ఇప్పటి వరకు జరగిన 14 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఆనవాయితీగా వస్తున్నది. 1957లో గజ్వేల్‌ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండగా.. ఆ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన ఆర్‌.నర్సింహారెడ్డి, జేబీ ముత్యాలరావులు గెలుపొందగా ఆ సమయంలో ఆ పార్టీకి చెందిన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.

అదేవిధంగా 1962 నుంచి 1978వరకు కాంగ్రెస్‌కు చెందిన గజ్వేల్‌ సైదయ్య గెలుపొందగా ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1983, 1985, 1994, 1999 సంవత్సరాల్లో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా.. ఆ పార్టీ అధికార పగ్గాలను చేపట్టింది. 1989, 2004, 2009లలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు గెలుపొందగా ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే విధంగా 2014, 2018లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ నియోజకవర్గం నుంచి పోటీ గెలుపొందగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే సెంటిమెంట్‌తో కేసీఆర్‌ బరిలో దిగుతుండగా...గెలిచాక ఇక్కడే కొనసాగుతారా...? మారుతారా..? అనేది వేచి చూడాలి.

అభివృద్ధికి నమునాగా గజ్వేల్‌
తన సొంత ‘ఇలాఖా గజ్వేల్‌ను కేసీఆర్‌ అభివృద్ధికి నమునాగా మార్చారు. వేలాది కోట్ల నిధులతో అభివృద్ధి చేపట్టారు. ఇందులో భాగంగానే కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం, మల్లన్నసాగర్‌ మిషన్‌ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్‌ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్శిటీ, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆసుపత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆసుపత్రి, ఎడ్యుకేషన్‌ హబ్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ మోడల్‌ కాలనీ, మహతి ఆడిటోరియం, సీఎం మినీ క్యాంపు కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌, ఆడిటోరియం, పాండవుల చెరువు సుందరీకరణ, అర్బన్‌పార్కు, ప్రతి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌లు, గజ్వేల్‌లో స్పోర్ట్స్‌ విలేజ్‌ పనులకు అంకురార్పణ, వర్గల్‌లో ఫుడ్‌ పార్కు, తున్కిబొల్లారం, బండమైలారంలలో టీఎస్‌ఐఐసీ అధ్వర్యంలో పరిశ్రమల జోన్లు తదితర భారీ అభివృద్ధి పనులతో పాటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంపు, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి.

Advertisement
Advertisement