సదర్‌ సందడి | Sakshi
Sakshi News home page

సదర్‌ సందడి

Published Tue, Nov 14 2023 4:24 AM

సదర్‌ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతాప్‌రెడ్డి - Sakshi

మర్కూక్‌ (గజ్వేల్‌): సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్‌ వేడుకలు మండల పరిధిలోని ఎర్రవల్లిలో ఘనంగా నిర్వహించారు. దీపావళి సందర్భంగా యాదవసంఘం ఆధ్వర్యంలో సదర్‌ సమ్మేళనం జరిగింది. దున్నపోతుల విన్యాసాలు, యాదవుల ఆటపాటలతో సదర్‌ సమ్మేళనం సందడిగా సాగింది. గ్రామం పురవీధుల్లో దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం యాదవ సోదరులు వేడుకలకు హాజరైన ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డిని, జెడ్పీటీసీ మంగమ్మ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, యాదవసంఘం మండల అధ్యక్షుడు ప్రవీణ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భాగ్య పాల్గొన్నారు.

16న గ్రహణమొర్రి

నిర్ధారణ పరీక్షలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా విద్యాశాఖ –సమగ్రశిక్షా ఆధ్వర్యంలో ఈ నెల 16న గ్రహణ మొర్రి ఉచిత పరీక్షలు నిర్వహించనున్నారు. బసవతారకం హాస్పిటల్‌ హైదరాబాద్‌ సౌజన్యంతో గ్రహణ మొర్రి, గ్రహణ శూల నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఉచితంగా శాస్త్ర చికిత్సలు అందించనున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పరీక్షలకు వచ్చే చిన్నారులు తమ ఆధార్‌, రేషన్‌ కార్డ్‌తో హాజరు కావలన్నారు. పూర్తి వివరాలకు 90308 55574 ను సంప్రదించాలన్నారు.

ఎస్సీ వర్గీకరణ

రాజ్యాంగ విరుద్ధం

మాల మహానాడు జాతీయ

ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్‌

చేర్యాల(సిద్దిపేట): ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, వర్గీకరణకు మద్దతుతెలిపే బీజేపీని చిత్తుగా ఓడిస్తామని మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్‌ అన్నారు. ఆదివారం ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం రమేశ్‌ మాట్లాడుతూ తెలంగాణలో మాదిగల కన్నా మాలలే అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, కొన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లెక్కలను బూచిగా చూపించి మాల మాదిగలను విడగొట్టాలని ఎస్సీ వర్గీకరణ అస్త్రాన్ని ప్రయోగించాయని ఆరోపించారు. కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, మార్కెట్‌ డైరెక్టర్‌ బుట్టి ఆగమల్లు, నాయకులు పాల్గొన్నారు.

విభేదాలు వీడాలి

సంజీవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్‌ షెట్కార్‌

పెద్దశంకరంపేట(మెదక్‌): విభేదాలు వీడి పనిచేస్తే గెలుపు మనదేనని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, జహీరాబాద్‌ మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ అన్నారు. సోమవారం పార్టీ నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సంజీవరెడ్డితో కలిసి పెద్దశంకరంపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం ప్రతీ కార్యకర్త పనిచేయాలని, అధికారంలోనికి వస్తే ధరణిని రద్దు చేస్తామని, ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వస్తామన్నారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి దౌర్జన్యాలు సాగనివ్వమన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రూ. 5లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. పెద్దశంకరంపేట సర్పంచ్‌ సత్యనారాయణ, కమలాపూర్‌, ముసాపేట తదితర గ్రామాలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు కె.శ్రీనివాస్‌, శంకరయ్య, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్‌షెట్కార్‌, నాయకులు రాయిని మధు, నారాగౌడ్‌, సంగమేశ్వర్‌, రాజేందర్‌గౌడ్‌, జైహింద్‌రెడ్డి, గంగారెడ్డి, రాజేష్‌, రాజునాయక్‌, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నాయకులు
1/1

మాట్లాడుతున్న నాయకులు

Advertisement

తప్పక చదవండి

Advertisement