కేసీఆర్‌ పాలనలోనే గజ్వేల్‌ భద్రం | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పాలనలోనే గజ్వేల్‌ భద్రం

Published Tue, Nov 21 2023 4:36 AM

గజ్వేల్‌లో ప్రసంగిస్తున్న మంత్రి హరీశ్‌రావు - Sakshi

● అభివృద్ధిపై రాద్దాంతం చేసిన వారు ఓటు ఎలా అడుగుతారు? ● కాంగ్రెస్‌, బీజేపీలకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు ● మంత్రి హరీశ్‌రావు ● గజ్వేల్‌ పట్టణంలో రోడ్‌ షో

గజ్వేల్‌: అభివృద్ధిపై రాద్దాంతం చేసిన కాంగ్రెస్‌, బీజేపీలకు ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ సోమవారం గజ్వేల్‌లోని ఇందిరాపార్కు చౌరస్తాలో రోడ్‌ షో నిర్వహించారు. ఆ తర్వాత విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గజ్వేల్‌కు ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని అక్కసు వెళ్లగక్కిన బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ప్రస్తుతం ఇక్కడ ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కేసీఆర్‌ చేతిలోనే గజ్వేల్‌ భద్రంగా ఉంటుందనే విషయం ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలను మోసం చేయలేరని చెప్పారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, గజ్వేల్‌ మార్కెట్‌ కమీటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ఎంపీపీ అమరావతి జెడ్పీటీసీ మల్లేశం, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీయొద్దీన్‌, పార్టీ గజ్వేల్‌ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా తదితరులు పాల్గొన్నారు. కాగా కేసీఆర్‌ మద్దతు ప్రకటిస్తూ విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు మంత్రికి ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందించారు.

సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ఖాయం

ములుగు(గజ్వేల్‌)ః అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ములుగులో సోమవారం బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రాజెక్ట్‌ల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. గత కాంగ్రెస్‌ పాలనలో ఏ గ్రామానికి వెళ్లాలన్నా గతుకుల రోడ్లు దర్శనమిచ్చేవని, పదేళ్ల కాలంలో ఎవరూ చేయలేని అభివృద్ధిని కేసీఆర్‌ చేసి చూపారని అన్నారు.

తిన్న రేవును మరవొద్దు

కొండపాక(గజ్వేల్‌): తిన్న రేవు తలవడం ధర్మమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మండల పరిధిలోని ఖమ్మంపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు, పంచాయతీ పాలక వర్గం సభ్యులు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం ప్రతి పక్ష పార్టీలకు అలవాటన్నారు. పని చేసే వారికి పార్టీలో సరైన సమయంలో గుర్తింపు నివ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మడుపు భూంరెడ్డి, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ర్యాగల్ల దుర్గయ్య, యాదగిరి, దామ శంకరయ్య, మంద శ్రీనివాస్‌రెడ్డి, అనంతుల నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కష్టాలు తీర్చిన కేసీఆర్‌ను మరువొద్దు

వర్గల్‌(గజ్వేల్‌): కాంగ్రెస్‌, బీజేపీలవి కాయకొరుకుడు మాటలే తప్ప ప్రజలకు చేసిందేమీలేదని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం వర్గల్‌ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా రోడ్డుషోలో పాల్గొని ప్రసంగించారు. మన బతుకులు బాగుపడాలన్నా, మరింత అభివృద్ధి సాధించాలన్నా, గర్వపడేలా జీవించాలన్నా సీఎం కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలతో ఎండకాలంలోనూ హల్దీవాగును, వర్గల్‌ పెద్దచెరువు, బంధం, ఖాన్‌చెరువులు మత్తడి దూకేలా చేసి సాగునీటి కష్టాలు తీర్చిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ను మరువొద్దన్నారు. కేసీఆర్‌ వచ్చిన తరువాతే గజ్వేల్‌ నియోజకవర్గం అభివృద్ధికి మోడల్‌గా నిలించిందన్నారు. కరెంటు గోస, తాగునీటి బాధ తీర్చిన ఘనత, గజ్వేల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, అటవీఅభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ లత రమేష్‌గౌడ్‌, జెడ్పీటీసీ బాలూయాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement