అమిత్‌ ఖత్రీకి రజతం | Sakshi
Sakshi News home page

అమిత్‌ ఖత్రీకి రజతం

Published Sun, Aug 22 2021 4:49 AM

Amit Khatri wins silver in 10km race walk at U-20 Worlds - Sakshi

నైరోబి: భారత అథ్లెట్‌ అమిత్‌ ఖత్రీ సుదీర్ఘ పరుగులో సత్తా చాటుకున్నాడు. ప్రపంచ జూనియర్‌ (అండర్‌–20) అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 10,000 మీ. పరుగులో అతను రజత పతకం సాధించాడు. మహిళల 400 మీ. పరుగులో ప్రియా మోహన్‌ తృటిలో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రోహ్‌టక్‌కు చెందిన 17 ఏళ్ల టీనేజ్‌ అథ్లెట్‌ అమిత్‌ ఖత్రీ ఓ రకంగా అద్భుతమే చేశాడు.

సాధారణంగా ఆఫ్రికా అథ్లెట్లకు మాత్రమే సాధ్యమయ్యే సుదీర్ఘ పరుగులో భారత అథ్లెట్‌ పతకం గెలవడం విశేషం. శనివారం జరిగిన పురుషుల పదివేల మీటర్ల రేస్‌వాక్‌లో అతను పోటీని 42 నిమిషాల 17.94 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన హెరిస్టోన్‌ వాన్యోని 42 ని.10.84 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకం సాధించగా, స్పెయిన్‌ అథ్లెట్‌ పాల్‌ మెక్‌గ్రాత్‌ (42ని.26.11 సె.) కాంస్యం గెలుపొందాడు. నిజానికి ఖత్రీ స్వర్ణం గెలిచే అవకాశాలు చివరి వరకు కనిపించాయి.

వేగంగా దూసుకెళ్లిన అతను 8 ల్యాపులు ముగిసే సరికి అందరికంటే ముందున్నాడు. దాదాపు 9000 మీటర్ల దాకా ఇదే వేగం నమోదు చేయగా... స్థానిక అథ్లెట్‌ వాన్యోని అనూహ్యంగా ఆఖరి ల్యాపులో అమిత్‌ ఖత్రీని అధిగమించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. కెన్యా రాజధాని నైరోబి సముద్ర మట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంటుంది. ఇది భారతీయులకు ప్రతికూల ప్రదేశం. ఇలాంటి చోట భారత అథ్లెట్‌ సుదీర్ఘ పరుగులో స్వర్ణానికి చేరువగా వెళ్లడం ఆషామాషీ విషయం కాదు.

పరుగు ముగిసిన అనంతరం ఖత్రీ మాట్లాడుతూ ‘నేను ఆశించిన ఫలితం కాదిది. అయినా సరే రజతంతో తృప్తిగా ఉన్నాను. ఐదు రోజుల ముందు ఇక్కడికొచ్చిన నన్ను ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టింది. ఒక ల్యాప్‌లో అయితే శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది’ అని అన్నాడు. పాల్గొన్న తొలి అంతర్జాతీయ పోటీలో రజతం గెలిచిన తన శిష్యుడి ప్రదర్శన పట్ల కోచ్‌ చందన్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. మహిళల 10వేల మీటర్ల రేస్‌వాక్‌లో బల్జీత్‌కౌర్‌ (48 ని.58.17 సె) ఏడో స్థానంలో నిలిచింది.

ప్రియకు చేజారిన పతకం...
మహిళల 400 మీటర్ల పరుగులో అనేక అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రియా మోహన్‌కు నిరాశే ఎదురైంది. దురదృష్టవశాత్తూ ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఫైనల్‌ పోటీని ప్రియ 52.77 సెకన్లలో ముగించింది. ఈ ఈవెంట్‌లో ఇమావోబంగ్‌ (నైజీరియా; 51.55 సె.), కార్నెలియా (పోలండ్‌; 51.97 సె.), కెన్యా అథ్లెట్‌ సిల్వియా చెలన్‌గట్‌ (52.23 సె.) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలిచారు. పురుషుల 400 మీ. హర్డిల్స్‌లో రోహన్‌ గౌతమ్‌ కాంబ్లి ఫైనల్‌ చేరడంలో విఫలమయ్యాడు. సెమీస్‌లో అతను 52.88 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల హీట్స్‌లో అబ్దుల్‌ రజాక్, సుమిత్‌ చహల్, కపిల్, భరత్‌ శ్రీధర్‌లతో కూడిన జట్టు హీట్స్‌తోనే సరిపెట్టుకుంది.

Advertisement
Advertisement