Sakshi News home page

వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కాకపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు..!

Published Wed, Jul 5 2023 9:12 AM

Andrew Balbirnie Steps Down As Ireland Captain, Stirling Steps In - Sakshi

ఐర్లాండ్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023కు అర్హత సాధించలేకపోవడంతో ఆ జట్టు కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో ఏడో స్థానం కోసం నిన్న (జులై 4) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించిన అనంతరం బల్బిర్నీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపాడు. బల్బిర్నీ తప్పుకోవడంతో క్రికెట్‌ ఐర్లాండ్‌ (సీఐ) పాల్‌ స్టిర్లింగ్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. 

32 ఏళ్ల బల్బిర్నీ మూడు ఫార్మాట్లలో కలిపి 89 మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బల్బిర్నీ 2019లో ఈ బాధ్యతలు చేపట్టాడు. బల్బిర్నీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గెలుపుతో ముగింపు పలకడం విశేషం. 

కాగా, జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌-2023 క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్‌ కనీసం సూపర్‌ సిక్స్‌ దశకు కూడా చేరలేకపోయింది. ఆ జట్టు గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. ఈ టోర్నీలో అజేయంగా ఉన్న శ్రీలంక ఇదివరకే వన్డే వరల్డ్‌కప్‌-2023కు అర్హత సాధించగా.. మరో బెర్త్‌ కోసం స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌ మధ్య పోటీ నెలకొంది. నిన్న జరిగిన  కీలక సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ చేతిలో ఓటమితో జింబాబ్వే వరల్డ్‌కప్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement