అర్జున్‌ పరాజయం సెమీస్‌లో ప్రజ్ఞానంద | Sakshi
Sakshi News home page

అర్జున్‌ పరాజయం సెమీస్‌లో ప్రజ్ఞానంద

Published Fri, Aug 18 2023 2:24 AM

Arjun defeats Pragnananda in the semis - Sakshi

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఓపెన్‌ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రజ్ఞానంద 5–4తో గెలుపొందాడు. దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్‌ దశకు చేరిన తొలి భారత ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల అర్జున్‌ కడదాకా పోరాడినా చివరకు తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఎత్తులకు చేతులెత్తేశాడు.

బుధవారం ఇద్దరి మధ్య రెండు క్లాసికల్‌ గేమ్‌ల తర్వాత స్కోరు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు గురువారం ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు గేమ్‌లు ఆడించారు. ఈ రెండూ ‘డ్రా’ కావడంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడించారు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 76 ఎత్తుల్లో గెలుపొందగా... రెండో గేమ్‌లో అర్జున్‌ 28 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో స్కోరు 3–3తో సమంగా నిలిచింది.

ఈ దశలో 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడించారు. ఇందులో తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో అర్జున్‌ 36 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 4–4తో సమంగా నిలిచింది. దాంతో ‘సడన్‌ డెత్‌’ టైబ్రేక్‌ మొదలైంది. ‘సడన్‌డెత్‌’లో తొలుత నెగ్గిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటిస్తారు. ‘సడన్‌డెత్‌’ తొలి గేమ్‌లోనే ప్రజ్ఞానంద 72 ఎత్తుల్లో అర్జున్‌ను ఓడించి విజేతగా అవతరించాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌ తొలి గేముల్లో ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో నిజాత్‌ అబసోవ్‌ (అజర్‌బైజాన్‌)... కరువానా (అమెరికా)తో ప్రజ్ఞానంద తలపడతారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement