India Vs Pakistan Asia Cup 2022 Super 4: Virat Kohli Comments On MS Dhoni - Sakshi
Sakshi News home page

Virat Kohli: ధోని తప్ప ఒక్కరూ మెసేజ్‌ చేయలేదు.. టీవీలో వాగినంత మాత్రాన: కోహ్లి ఘాటు వ్యాఖ్యలు

Published Mon, Sep 5 2022 11:32 AM

Asia Cup 2022 Ind Vs Pak Virat Kohli Slams Critics And Lauds Dhoni No One - Sakshi

Asia Cup 2022 Super 4 India Vs Pakistan- Virat Kohli Comments: ఆసియా కప్‌-2022 టోర్నీలో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడుతూ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి. మెగా ఈవెంట్‌కు ముందు నిలకడలేమి ఫామ్‌ కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యాడు ఈ మాజీ సారథి. అయితే, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీలో అడుగుపెట్టి.. తనదైన శైలిలో రాణిస్తున్నాడు.

ఆసియా కప్‌ టీ20 ఈవెంట్‌లో దాయాది పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో 35 పరుగులు చేశాడు కోహ్లి. ఇక హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే విధంగా సూపర్‌-4 తొలి మ్యాచ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థిపై 60 పరుగులు సాధించి సత్తా చాటాడు. కానీ, బౌలర్ల వైఫల్యం కారణంగా ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు.

ధోని తప్ప ఒక్కరూ మెసేజ్‌ చేయలేదు
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. తనను విమర్శిస్త్ను వారికి దిమ్మతిరిగే రీతిలో కౌంటర్‌ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. నిజంగా.. నిజాయితీగా సలహాలు ఇచ్చేవాళ్లు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటూ విమర్శకులకు చురకలు అంటించాడు. టీవీతో ముందు కూర్చుని ఏదో వాగినంత మాత్రాన తాను పట్టించుకోనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

నిజాయితీ ఉన్నవాళ్లైతే.. టీవీల్లో వాగరు!
ఈ మేరకు.. ‘‘నేను టెస్టు కెప్టెన్సీ వదిలేసినపుడు.. నాకు కేవలం ఒకే ఒక వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది. గతంలో నేను ఎంతో మంది ప్లేయర్లతో కలిసి ఆడాను. చాలా మంది దగ్గర నా ఫోన్‌ నంబర్‌ కూడా ఉంది. కానీ వాళ్లెవరూ కనీసం నన్ను పలకరించలేదు. అయితే, టీవీ చర్చల్లో మాత్రం నాకు సలహాలు ఇస్తుంటారు.

ఇంతకీ నాకు మెసేజ్‌ చేసిన ఆ వ్యక్తి ఎవరంటే.. ఎంఎస్‌ ధోని. నిజంగా మనకు ఒకరిపట్ల గౌరవం, వారు బాగు పడాలని కోరుకునే మంచి మనసు ఉంటే.. ఆయనలా ప్రవర్తిస్తారు. నిజానికి ఆయన నుంచి నేను ఏమీ ఆశించలేదు. ఆయన కూడా అంతే. నా నుంచి ఏమీ ఆశించలేదు.

ధోని కెప్టెన్సీలోనే నేను.. నా సారథ్యంలో ధోని ఆడినపుడు మేము ఎప్పుడూ అభద్రతా భావానికి గురికాలేదు. నేను చెప్పేది ఏమిటంటే.. ఒకరికి నిజంగా మనం మంచి చేయాలనుకుంటే.. సహాయం చేయాలని భావిస్తే.. వారితో వ్యక్తిగతంగా మాట్లాడండి. ఉపయోగకరంగా ఉంటుంది.

వాటికి విలువ ఉండదు
అంతేకానీ.. టీవీ చర్చల్లో.. ప్రపంచం అంతా చూస్తుండగా.. నాకు సలహాలు ఇస్తే వాటికి ఏమాత్రం విలువ ఉండదు. అలాంటి వారి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు. నేరుగా మాట్లాడినపుడే ఎదుటి వ్యక్తి నిజాయితీ ఏమిటో బయటపడుతుంది.

నిజానికి టీవీల్లో ఉచిత సలహాలు ఇచ్చే వాళ్లను నేను పట్టించుకోను. వాళ్ల బుద్ధి ఎలాంటిదో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. దేవుడు మనకి అన్నీ ఇస్తాడు. విజయవంతంగా ముందుకు సాగేందుకు దారిని మాత్రమే చూపిస్తాడు. అయితే, దానిని ఎలా వినియోగించుకున్నామన్నది మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే ఇతరుల పట్ల ఎలా మసలుకోవాలో మన ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని కోహ్లి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

వారిని ఉద్దేశించేనా?
కాగా టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీ తర్వాత కోహ్లి స్వయంగా టీమిండియా పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ వదిలేశాడు. అయితే, అనూహ్య రీతిలో అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో టెస్టు సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి తనకు తానుగా తప్పుకొన్నాడు.

కోహ్లి వైదొలిన తర్వాత రోహిత్‌ శర్మ అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు సారథిగా నియమితుడయ్యాడు. ఇక కోహ్లి తాజా వ్యాఖ్యలు తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సహా తనను విమర్శించిన లెజెండ్‌ కపిల్‌ దేవ్‌ వంటి వాళ్లను ఉద్దేశించినవే అని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Ind Vs Pak: కీలకమైన సమయంలో క్యాచ్‌ నేలపాలు.. అర్ష్‌దీప్‌పై మండిపడ్డ రోహిత్‌! వైరల్‌
Asia Cup 2022 - Ind Vs Pak: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. మాకిది గుణపాఠం.. ఇక కోహ్లి: రోహిత్‌

Advertisement
Advertisement