ఆసియా కప్‌-2023 విజేతలు గ్రౌండ్స్‌మెన్‌, పిచ్‌ క్యూరేటర్స్‌ | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌-2023 విజేతలు గ్రౌండ్స్‌మెన్‌, పిచ్‌ క్యూరేటర్స్‌

Published Sun, Sep 17 2023 8:02 PM

Asia Cup 2023: Asia Cricket Council And Sri Lanka Cricket Announces USD 50000 For Curators And Groundsman - Sakshi

2023 ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా ఎగరేసుకుపోయింది. ఇవాళ (సెప్టెంబర్‌ 17) జరిగిన ఫైనల్లో భారత్‌.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (23), శుభ్‌మన్‌ గిల్‌ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 

అంతకుముందు మహ్మద్‌ సిరాజ్‌ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్‌ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక​ 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్‌ మెండిస్‌ (17), దుషన్‌ హేమంత (13 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

తెర వెనుక హీరోలకు గుర్తింపు..
2023 ఆసియా కప్‌ విజయవంతం కావడంలో కొలొంబో, క్యాండీ మైదానాల సహాయ సిబ్బంది, పిచ్‌ క్యూరేటర్ల పాత్ర చాలా కీలకమైంది. వీరి కమిట్‌మెంట్‌ లేనిది ఆసియా కప్‌ అస్సలు సాధ్యపడేది కాదు. కీలక మ్యాచ్‌లు జరిగిన సందర్భాల్లో వర్షాలు తీవ్ర ఆటంకాలు కలిగించగా.. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌ ఎంతో అంకితభావంతో పని చేసి మ్యాచ్‌లు సాధ్యపడేలా చేశారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గ్రౌండ్స్‌మెన్‌ సేవలు వెలకట్టలేనివి.

వారు ఎంతో అప్రమత్తంగా ఉండి, వర్షం పడిన ప్రతిసారి కవర్స్‌తో మైదానం మొత్తాన్ని కప్పేశారు. స్థానికమైన ఎన్నో టెక్నిక్స్‌ను ఉపయోగించి, వీరు మైదానాన్ని ఆర బెట్టిన తీరు అమోఘమని చెప్పాలి. వీరి పనితనానికి దేశాలకతీతంగా క్రికెట్‌ అభిమానులు ముగ్దులైపోయారు. ఆసియా కప్‌-2023 నిజమైన విజేతలు గ్రౌండ్స్‌మెన్‌, పిచ్‌ క్యూరేటర్స్‌ అని సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు.

అంతిమంగా వీరి కష్టానికి తగిన గుర్తింపు దక్కింది. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ), శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ).. కొలొంబో, క్యాండీ మైదానాల గ్రౌండ్స్‌మెన్‌, క్యూరేటర్లకు 50,000 యూఎస్‌ డాలర్ల ప్రైజ్‌మనీని ప్రకటించారు. వారి కమిట్‌మెంట్‌, హార్డ్‌వర్క్‌లకు ఇది గుర్తింపు అని ఏసీసీ చైర్మన్‌ జై షా అన్నారు. వీరు లేనిది ఆసియా కప్‌-2023 సాధ్యపడేది కాదని షా ప్రశంసించారు. కాగా, ఫైనల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మహ్మద్‌ సిరాజ్‌ తనకు లభించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు​.

Advertisement
Advertisement