Ind vs SL: అస్సలు ఊహించలేదు.. కోహ్లి వికెట్‌ తీశాడు.. కానీ! | Sakshi
Sakshi News home page

Dasun Shanaka: అస్సలు ఊహించలేదు.. వెల్లలగే అద్భుతం చేశాడు.. కానీ!

Published Wed, Sep 13 2023 1:30 PM

Asia Cup 2023 Ind vs SL: Dasun Shanaka Didnt Expect Wicket Lauds Wellalage - Sakshi

Asia Cup 2023- India vs Sri Lanka: ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమిపై శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక స్పందించాడు. కొలంబో వికెట్‌ బ్యాటర్లకు అనుకూలిస్తుందని భావించామని.. కానీ అనూహ్యరీతిలో బంతి టర్న్‌ అయిందని పేర్కొన్నాడు. 

ఇక దునిత్‌ వెల్లలగే అద్భుతం చేయగలడని తాను ముందే ఊహించానన్న షనక.. అందుకు తగ్గట్లే అతడి ఆట తీరు కొనసాగిందని హర్షంవ వ్యక్తం చేశాడు. అదే విధంగా చరిత్‌ అసలంక, ధనంజయ డి సిల్వ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారని కొనియాడాడు.

టాపార్డర్‌ను కుదేలు చేసిన వెల్లలగే
కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుని.. లంకను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రీలంక స్పిన్నర్లు దునిత్‌ వెల్లలగే, చరిత్‌ అసలంక ధాటికి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుదేలైంది. 

వెల్లలగే ఐదు, అసలంక నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహీశ్‌ తీక్షణకు ఒక వికెట్‌ దక్కింది. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అర్ధ శతకం(53)తో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. 49.1 ఓవర్లలో టీమిండియా 213 పరుగులు చేయగలిగింది.

అసలంక, ధనంజయ పోరాడినా
లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను స్పిన్‌ ఆల్‌రౌండర్లు చరిత్‌ అసలంక(22), ధనంజయ డి సిల్వ(41) ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్ల ధాటికి లంక జట్టు 172 పరుగులకే చాపచుట్టేయగా.. 41 పరుగులతో గెలిచి రోహిత్‌ సేన ఫైనల్‌కు చేరింది.  కాగా  ఈ ఓటమితో వరుసగా 13 వన్డే విజయాలు సాధించిన షనక బృందం జోరుకు బ్రేక్‌ పడింది.

బౌలింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తూ
ఈ నేపథ్యంలో దసున్‌ షనక మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. బ్యాటింగ్‌ పిచ్‌ అనుకున్నాం.. కానీ అలా జరుగలేదు. వెల్లలగే అద్భుతంగా రాణించాడు. ధనంజయ, అసలంక కూడా గొప్పగా బౌలింగ్‌ చేశారు. ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లు నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. అందుకే టీమిండియాతో మ్యాచ్‌లోనాకు వారిద్దరి రూపంలో రెండు మంచి స్పిన్‌ ఆప్షన్లు కనిపించాయి’’ అని పేర్కొన్నాడు.

ఇక వెల్లలగే అద్భుతంగా ఆడగలడని అంచనా వేశానన్న షనక.. అతడు విరాట్‌ కోహ్లి వికెట్‌ తీయడం ప్రత్యేకమని హర్షం వ్యక్తం చేశాడు. ఈరోజు వెల్లలగేదే అంటూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో వెల్లలగే శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌  కోహ్లి(3), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా వికెట్లు తీశాడు.ఘ

తదుపరి పాకిస్తాన్‌తో చావోరేవో
ఇదిలా ఉంటే.. శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో చావోరేవో తేల్చుకోనుంది. గురువారం నాటి ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే లంక ఫైనల్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్‌ టోర్నీలో శ్రీలంక ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

చదవండి: టీమిండియాకు షాక్‌.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్‌! రేసులో అతడు కూడా!
5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్‌ వెల్లలగే? 

Advertisement

తప్పక చదవండి

Advertisement