భారత్‌ చేతిలో పాక్‌ చిత్తు | Sakshi
Sakshi News home page

భారత్‌ చేతిలో పాక్‌ చిత్తు

Published Tue, Sep 12 2023 6:05 AM

Asia Cup 2023: India crushed Pakistan by 228 runs in a Super 4 match - Sakshi

వహ్వా... ఇది కదా ఆటంటే... దీని కోసమే కదా మన అభిమానులంతా ఆశలు పెట్టుకుంది... నేనున్నానంటూ వాన మళ్లీ మళ్లీ వచ్చేస్తున్నా ఇలాంటి ఒక్క మ్యాచ్‌ కోసమే కదా అందరం ఎదురు చూసింది... ఇందుకే కదా నిర్వాహకులు ఈ ఒక్క పోరు కోసం నిబంధనలు మార్చేసింది... రిజర్వ్‌ డే అంటూ పెట్టుకున్నందుకు తగిన న్యాయం చేస్తున్నట్లుగా భారత బ్యాటర్లు చెలరేగి వినోదం పంచారు. తొలి పోరులో విఫలమై పాక్‌ బౌలింగ్‌ను ఆడలేరంటూ వచ్చిన విమర్శలను చిత్తు చేస్తూ చెలరేగారు. పేలవ బౌలింగ్‌ తర్వాత కొండంత లక్ష్యానికి చేరువగా కూడా రాలేక పాక్‌ కుప్పకూలింది.

ఒక్కసారి లయ అందుకుంటే తాను ఎంత బాగా ఆడగలనో కోహ్లి చూపించాడు... గతంలోలాగా ఒక్క ఇన్నింగ్స్‌లో ఎన్నో రికార్డులు అందుకుంటూ ముందుకు సాగిపోతూ సచిన్‌ సెంచరీలకు సరిగ్గా రెండడుగుల దూరంలో నిలిచాడు... మరోవైపు ఫామ్, ఫిట్‌నెస్‌ చూపించుకోవాల్సిన స్థితిలో బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సెంచరీతో చెలరేగాడు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయలేక పాక్‌ బౌలర్లు చేతులెత్తేశారు. గత మ్యాచ్‌లో టాప్‌–4ను తొందరగా పడగొట్టి ఆధిక్యం చూపించిన పాక్‌ పని పట్టేందుకు ఇప్పుడు టాప్‌–4 మాత్రమే సరిపోయారు.   


కొలంబో: వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ తమ ఆధిక్యాన్ని మరింత స్పష్టంగా ప్రదర్శించింది. ఆసియా కప్‌లో ఆసక్తిని రేపిన ‘సూపర్‌–4’ పోరులో టీమిండియాదే పైచేయి అయింది. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 228 పరుగుల భారీ తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది. ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 147/2తో సోమ వారం ఆట కొనసాగించిన భారత్‌ 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.

విరాట్‌ కోహ్లి (94 బంతుల్లో 122 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (106 బంతుల్లో 111 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకాలతో చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 233 పరుగులు జోడించారు. ఈ జోడీ 32.1 ఓవర్లలోనే 7.25 రన్‌రేట్‌తో ఈ పరుగులు రాబట్టడం విశేషం. సోమవారం 25.5 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసినా పాకిస్తాన్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయింది. అనంతరం పాక్‌ 32 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఫఖర్‌ జమాన్‌ (27)దే అత్యధిక స్కోరు. గాయాల కారణంగా రవూఫ్, నసీమ్‌ షా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో 8 వికెట్లకే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. కుల్దీప్‌కు 5 వికెట్లు దక్కాయి.  

డబుల్‌ ధమాకా...
రిజర్వ్‌ డే రోజున కూడా భారత జట్టు తొలి రోజు తరహాలోనే తమ జోరు కొనసాగించింది. పాకిస్తాన్‌ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కోహ్లి, రాహుల్‌ చక్కటి షాట్లతో చెలరేగారు. షాహిన్‌ సహా ఇతర బౌలర్ల పేలవ ప్రదర్శనకు తోడు గాయం కారణంగా రవూఫ్‌ సోమవారం అసలు బౌలింగ్‌కే దిగకపోవడం కూడా పాక్‌ను దెబ్బ తీసింది. ముందుగా 60 బంతుల్లో రాహుల్, ఆ తర్వాత 55 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు.

40 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 251 పరుగులకు చేరింది. తర్వాతి పది ఓవర్లలో భారత జోడీ మరింతగా దూసుకుపోయింది. తర్వాతి 5 ఓవర్లలో జట్టు 49 పరుగులు రాబట్టి 300 పరుగుల మార్క్‌ అందుకుంది. నాలుగు బంతుల వ్యవధిలో రాహుల్‌ (100 బంతుల్లో), కోహ్లి (84 బంతుల్లో) ఖాతాలో శతకాలు చేరాయి. ఆఖరి 5 ఓవర్లలో భారత్‌ 56 పరుగులు రాబట్టడం విశేషం. ఫహీమ్‌ వేసిన చివరి ఓవర్లో ఆఖరి మూడు బంతులను వరుసగా 4, 4, 6గా మలచి కోహ్లి ఘనంగా ఇన్నింగ్స్‌ ముగించాడు.  


టపటపా...
ఛేదనలో మొదటి నుంచే తడబడిన పాకిస్తాన్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇమామ్‌ (9)ను అవుట్‌ చేసి బుమ్రా తొలి వికెట్‌ అందించగా,
పాండ్యా బౌలింగ్‌లో బాబర్‌ (10) బౌల్డయ్యాడు. వాన విరామం తర్వాత తొలి ఓవర్లోనే రిజ్వాన్‌ (2)ను శార్దుల్‌ అవుట్‌ చేయడంతో పాక్‌ పరిస్థితి మరింత దిగజారింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో ఫఖర్, సల్మాన్‌ (23) వెనుదిరిగారు. అతి కష్టమ్మీద 24.5 ఓవర్లలో 100 పరుగులకే చేరిన జట్టు ఆ తర్వాత వేగంగా ఓటమి దిశగా పయనించింది.  

ఆగని వాన...
రిజర్వ్‌ డే రోజున కూడా వర్షం మ్యాచ్‌ను వెంటాడింది. వాన తెరిపినివ్వకపోవడంతో ఆట ఆరంభానికే చాలా సమయం పట్టింది. చివరకు 1 గంట 40 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌ మొదలైంది. ఆ తర్వాత పాక్‌ ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు ముగిశాక వర్షం రాకతో ఆట నిలిచిపోయింది. ఈ సమయంలో మరో 1
గంట 12 నిమిషాల విరామం వచ్చింది.  

47: వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. అగ్రస్థానంలో ఉన్న సచిన్‌ (49) శతకాలను అందుకునేందుకు మరో 2 సెంచరీలు దూరంలో మాత్రమే ఉన్నాడు.
5: వన్డేల్లో కోహ్లి 13 వేల పరుగులు పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్‌కంటే 54 ఇన్నింగ్స్‌లు తక్కువగా ఆడి కోహ్లి ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. ప్రేమదాస స్టేడియంలో అతనికి వరుసగా నాలుగు వన్డేల్లో నాలుగో సెంచరీ కావడం మరో విశేషం.
1: పాకిస్తాన్‌పై భారత్‌ తమ అత్యధిక స్కోరు (356)ను సమం చేసింది. 2005లోనూ వైజాగ్‌లో పాక్‌పై భారత్‌ 356 పరుగులు చేసింది.
5: వన్డేల్లో పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఐదో భారతీయ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌. గతంలో అర్షద్‌ అయూబ్‌ (5/21; 1988లో), సౌరవ్‌ గంగూలీ (5/16; 1997లో), వెంకటేశ్‌ ప్రసాద్‌ (5/27; 1999లో), సచిన్‌ టెండూల్కర్‌ (5/50; 2005లో) ఈ ఘనత సాధించారు.   


స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) ఫహీమ్‌ (బి) షాదాబ్‌ 56; గిల్‌ (సి) సల్మాన్‌ (బి) షాహిన్‌ 58; కోహ్లి (నాటౌట్‌) 122; రాహుల్‌ (నాటౌట్‌) 111; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 2 వికెట్లకు) 356.
వికెట్ల పతనం: 1–121, 2–123.  
బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 10–0–79–1, నసీమ్‌ షా 9.2–1–53–0, ఫహీమ్‌ 10–0–74–0, రవూఫ్‌ 5–0–27–0, షాదాబ్‌ 10–1–71–1, ఇఫ్తికార్‌ 5.4–0–52–0.  

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫఖర్‌ (బి) కుల్దీప్‌ 27; ఇమామ్‌ (సి) గిల్‌ (బి) బుమ్రా 9; బాబర్‌ (బి) పాండ్యా 10; రిజ్వాన్‌ (సి) రాహుల్‌ (బి) శార్దుల్‌ 2; సల్మాన్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 23; ఇఫ్తికార్‌ (సి అండ్‌ బి) కుల్దీప్‌ 23; షాదాబ్‌ (సి) శార్దుల్‌ (బి) కుల్దీప్‌ 6; ఫహీమ్‌ (బి) కుల్దీప్‌ 4; షాహిన్‌ (నాటౌట్‌) 7; నసీమ్‌ (ఆబ్సెంట్‌ హర్ట్‌), రవుఫ్‌ (ఆబ్సెంట్‌ హర్ట్‌), ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (32 ఓవర్లలో ఆలౌట్‌) 128.  
వికెట్ల పతనం: 1–17, 2–43, 3–47, 4–77, 5–96, 6–110, 7–119, 8–128.
బౌలింగ్‌: బుమ్రా 5–1–18–1, సిరాజ్‌ 5–0–23–0,
పాండ్యా 5–0–17–1, శార్దుల్‌ 4–0–16–1, కుల్దీప్‌ 8–0–25–5, జడేజా 5–0–26–0.  

Advertisement

తప్పక చదవండి

Advertisement