Asia Cup 2023: కొలొంబోలో భారీ వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం..! | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: కొలొంబోలో భారీ వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం..!

Published Sun, Sep 3 2023 8:56 PM

Asia Cup 2023 Super 4 Matches Likely To Be Rescheduled Due To Heavy Rains - Sakshi

ఆసియా కప్‌-2023 సూపర్‌-4 మ్యాచ్‌లకు వేదిక అయిన కొలొంబోలో భారీ వర్షాలు కురుస్తాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. వేదికను కొలొంబో నుంచి డంబుల్లా లేదా హంబన్‌తోటకు మార్చాలని ఏసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

సూపర్‌-4 దశలో మొదటి మ్యాచ్‌ (సెప్టెంబర్‌ 6, లాహోర్‌) మినహాయించి, మిగతా మ్యాచ్‌లన్నిటికీ కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. సూపర్‌-4 మ్యాచ్‌లతో పాటు సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ కూడా ఇదే వేదికగా జరగాల్సి ఉంది. కొలొంబో వాతావరణ శాఖ వారి తాజా హెచ్చరికల నేపథ్యంలో వేదిక మార్చే అంశాన్ని ఏసీసీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, భారత్‌, పాక్‌ల మధ్య పల్లెకెలెలో నిన్న (సెప్టెంబర్‌ 2) జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, సూపర్‌-4 దశలో భారత్‌-పాక్‌లు మరోసారి (సెప్టెంబర్‌ 10) తలపడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకునే ఏసీసీ వేదిక మార్పు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భారత్‌-నేపాల్‌ల మధ్య రేపు జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనా టీమిండియా సూపర్‌-4కు చేరుకుంటుంది. 

రేపటి మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగి నేపాల్‌ గెలిస్తే పాక్‌తో పాటు ఆ జట్టే సూపర్‌-4కు చేరుకుంటుంది. ఇది ఎలాగూ సాధ్యపడే విషయం కాదు కాబట్టి, సూపర్‌-4లో మరోసారి భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అభిమానులకు కనువిందు చేయడం ఖాయం. 

Advertisement
Advertisement