Avinash Sable: 30 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు

8 May, 2022 07:26 IST|Sakshi

5000 మీటర్ల విభాగంలో అవినాశ్‌ సాబ్లే ఘనత

కాలిఫోర్నియా: మూడు దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పురుషుల 5000 మీటర్ల భారత జాతీయ రికార్డు బద్దలైంది. మహారాష్ట్రకు చెందిన అవినాశ్‌ సాబ్లే తన పేరిట మరో జాతీయ రికార్డును లిఖించుకున్నాడు. అమెరికాలో జరిగిన సౌండ్‌ రన్నింగ్‌ ట్రాక్‌ మీట్‌లో 27 ఏళ్ల అవినాశ్‌ 5000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు.

గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ ఇండియన్‌ ఆర్మీ అథ్లెట్‌ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసి 12వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 1992లో బర్మింగ్‌హమ్‌ వేదికగా భారత అథ్లెట్‌ బహదూర్‌ ప్రసాద్‌ 13 నిమిషాల 29.70 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును అవినాశ్‌ సవరించాడు. అవినాశ్‌ ఖాతాలో ఇది మూడో జాతీయ రికార్డు కావడం విశేషం.

ప్రస్తుతం అవినాశ్‌ పేరిట 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, హాఫ్‌ మారథాన్‌ జాతీయ రికార్డులు ఉన్నాయి. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌లో భాగమైన సౌండ్‌ రన్నింగ్‌ ట్రాక్‌ మీట్‌లో అవినాశ్‌కు పతకం రాకపోయినా జాతీయ రికార్డును తిరగరాశానన్న సంతృప్తి లభించింది. అంతేకాకుండా ఈ ఏడాది జూలై 15 నుంచి 24 వరకు అమెరికాలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ముందు అవసరమైన ఆత్మవిశ్వాసం దక్కింది. 

మరిన్ని వార్తలు