PAK vs AUS 2nd ODI: Babar Azam Breaks Hashim Amla and Virat Kohli ODI Centuries - Sakshi
Sakshi News home page

Babar Azam: కోహ్లి, ఆమ్లా రికార్డును బద్దలు కొట్టిన పాక్‌ కెప్టెన్‌

Published Fri, Apr 1 2022 6:14 PM

Babar Azam Breaks Hashim Amla Virat Kohli ODI Centuries Vs Aus 2nd ODI - Sakshi

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌ అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పాక్‌ కెప్టెన్‌ బాబార్‌ ఆజం, ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ వీరోచిత శతకాలతో తమ వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అ‍త్యధిక స్కోరును చేధించింది. మూడు వన్డేల సిరీస్‌ను పాక్‌  1-1తో సమం చేసింది. ఈ నేపథ్యంలోనే పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం వన్డేల్లో ఒక అరుదైన ఫీట్‌ సాధించాడు. 83 బంతుల్లో 114 పరుగులు చేసిన బాబర్‌ వన్డేల్లో 15వ సెంచరీ అందుకున్నాడు. 83 ఇన్నింగ్స్‌ల్లోనే బాబర్‌ 15 సెంచరీలు సాధించాడు.

తద్వారా అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ సాధించిన బాబర్‌ ఆజం దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు. అంతకముందు ఆమ్లా 86 ఇన్నింగ్స్‌ ద్వారా 15వ సెంచరీ సాధించాడు. టీమిండియా మెషిన్‌ గన్‌ విరాట్‌ కోహ్లికి 15వ వన్డే సెంచరీ సాధించడానికి 106 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్‌ వార్నర్‌(108 ఇన్నింగ్స్‌లు), శిఖర్‌ ధావన్‌(108 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాక్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా ఆసీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెన్‌ మెక్‌డెర్మట్‌ (108 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...ట్రవిస్‌ హెడ్‌ (70 బంతుల్లో 89; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్నస్‌ లబ్‌షేన్‌ (49 బంతుల్లో 59; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. షాహిన్‌ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం పాక్‌ 49 ఓవర్లలో 4 వికెట్లకు 352 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్‌), ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (97 బంతుల్లో 106; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగగా, ఫఖర్‌ జమాన్‌ (64 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. తాజా ఫలితంతో సిరీస్‌ 1–1తో సమం కాగా, చివరి వన్డే శనివారం జరుగుతుంది.    

చదవండి: మంచివో.. చెడ్డవో; ఏవైనా సీఎస్‌కేకే సాధ్యం..

Pak Vs Aus 2nd ODI: ఆసీస్‌పై సంచలన విజయం.. బాబర్‌ ఆజం బృందం సరికొత్త రికార్డు!

Advertisement
Advertisement