'Ball Change Controversy': Ricky Ponting Demands Investigation Of 5th Test Win - Sakshi
Sakshi News home page

Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్‌ ఓటమి.. విచారణ చేపట్టండి'

Published Tue, Aug 1 2023 3:03 PM

Ball-Change Controversy-Ricky Ponting-Demand-Investigation-5th Test Win - Sakshi

దాదాపు నెలరోజులకు పైగా అలరించిన యాషెస్‌ సిరీస్‌ ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి 'యాషెస్‌'ను ఎగురేసుకపోతుందని అంతా భావించారు. కానీ మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్‌ 2-1కి ఆధిక్యం తగ్గించింది. ఇక నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం వచ్చినప్పటికి వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

ఇక కీలకమైన ఐదోటెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ విధించిన 384 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 334 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఇంగ్లండ్‌ 49 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అయినప్పటికి గత యాషెస్‌ను గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి ట్రోఫీని రిటైన్‌ చేసుకుంది.

నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ కొత్త బంతి తీసుకుంది. దాదాపు 37 ఓవర్ల పాటు అదే బంతితో బౌలింగ్‌ చేసింది. బంతి స్వింగ్ కాకపోవడంతో ఇంగ్లండ్ పేసర్లు ఎంత ప్రయత్నించినా వాళ్లను ఔట్ చేయలేకపోయారు. అయితే నాలుగో రోజు మార్క్ వుడ్ వేసిన ఒక బంతి ఖవాజా హెల్మెట్ ను బలంగా తాకింది. దీంతో ఆ బాల్ పాడవడంతో అంపైర్లు మరో బాల్ తీసుకున్నారు. అక్కడి నుంచే కథ మారిపోయింది. ఐదో రోజు ఉదయం ఆస్ట్రేలియా ఓపెనర్లును త్వరగా కోల్పోయింది.

కాగా మ్యాచ్‌ ముగిశాకా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌ బంతిని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని మార్చడం వల్లే ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఓడిందని పేర్కొన్నాడు. స్కైస్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. '' బంతి పరిస్థితి అంచనా వేయకుండానే దానిని మార్చాలని నిర్ణయించడం సరైంది కాదు. రెండు బంతులను పోలుస్తే సరైనవి చెప్పే మార్గంలో ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. మధ్యలో అలా కొత్త బంతిని తీసుకోవడం సరైంది కాదు. మీరు ఒకవేళ బంతిని మార్చాలని భావిస్తే ఆ తరహాలోనే ఉండేలా చూడాలి. అంపైర్లు పరీక్షిస్తున్న పెట్టలో మరీ పాతబడిన బంతులు ఎక్కువగా లేవు. కొన్ని చూసినప్పటికి వాటిని పక్కన పడేశారు.

పాత బంతి స్థానంలో కొత్తదానిని ఎంపిక చేసినట్లుగా ఉంది. ఐదోరోజు పిచ్‌ ఉదయం బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది. నాలుగోరోజు చివర్లో బంతిని మార్చడం వల్ల ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. అందుకే ఈ విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నా. బాక్స్‌లో అలాంటి పాత బంతులు లేవా? లేకపోతే అంపైర్లు ఏదొకటి ఎంచుకుని ఆడించారా? అనేది తేలాలి. అప్పటికి 37 ఓవర్లు మాత్రమే ఆ బంతితో ఆట జరిగింది. కానీ మార్చిన బంతి మాత్రం దానికి తగ్గట్టుగా లేదు'' అంటూ పాంటింగ్‌ పేర్కొన్నాడు.

ఇక ఉస్మాన్‌ ఖవాజా మాట్లాడుతూ.. "వాళ్లు బంతిని మార్చగానే ఆ కొత్త బాల్ చాలా భిన్నంగా ఉన్నట్లు అర్థమైంది. అప్పుడే అంపైర్ కుమార్ ధర్మసేన దగ్గరికి వెళ్లి ఈ బాల్ ఎంత పాతది? 8 ఓవర్లు వేసినట్లు కనిపిస్తోంది అని అడిగాను. ఆ బంతి నా బ్యాట్ ను చాలా బలంగా తాకింది. యాషెస్ లో ప్రతి టెస్టులో ఓపెనింగ్ చేశాను. కానీ ఏ బంతి కూడా అంత బలంగా నా బ్యాట్ను తాకలేదు. కొత్తగా బ్యాటింగ్ చేయడానికి వచ్చే వాళ్లతో ఈ కొత్త బంతి కాస్త భిన్నంగా ఉందని చెప్పాను. కొన్ని విషయాలు మనం నియంత్రించలేము. ఇది నిరాశ కలిగించింది. ఇంగ్లండ్ ది క్లాస్ బౌలింగ్ అటాక్. వాళ్లకు కాస్త సందు దొరికినా దానిని అద్భుతంగా ఉపయోగించుకుంటారు" అని ఖవాజా అన్నాడు.

చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్‌ దేవ్‌కు జడ్డూ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement