Sakshi News home page

శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ

Published Tue, Mar 19 2024 7:38 PM

Bangladesh Mushfiqur Rahim Ruled Out Of Sri Lanka Tests - Sakshi

మార్చి 22 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, సీనియర్‌ వికెట్‌కీపర్‌ ముష్ఫికర్‌ రహీం సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. శ్రీలంకతో నిన్న జరిగిన మూడో వన్డే సందర్భంగా రహీం కుడి చేతి బొటన వేలుకి గాయం కాగా.. ఎంఆర్‌ఐ రిపోర్ట్‌లో ఫ్రాక్చర్‌ అని తేలింది. దీంతో అతను అర్దంతరంగా సిరీస్‌ నుంచి వైదొలిగాడు.

రహీంకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించాల్సి ఉంది. 36 ఏళ్ల రహీం బంగ్లాదేశ్‌ టెస్ట్‌ జట్టులో కీలక సభ్యుడు. అతను ఇప్పటివరకు 88 టెస్ట్‌లు ఆడి 3 డబుల్‌ సెంచరీలు, 10 సెంచరీలు, 27 అర్దసెంచరీల సాయంతో 5676 పరుగులు చేశాడు. నిన్న శ్రీలంకపై వన్డే సిరీస్‌ విజయానంతరం రహీం హంగామా చేశాడు. స్వదేశంలో శ్రీలంకను మట్టికరిపించిన ఆనందంలో రహీం శ్రీలంక ఆటగాళ్లను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ప్రవర్తించాడు.

గతంలో శ్రీలంక ఆటగాళ్లు చేసిన ఓవరాక్షన్‌కు ప్రతిగా హెల్మట్‌ పట్టుకుని రీకౌంటర్‌ ఇచ్చాడు. ఈ ఉదంతం​ నిన్నటి నుంచి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. బంగ్లాదేశ్‌, శ్రీలంక ఆటగాళ్లకు మైదానంలో కౌంటర్‌కు రీకౌంటర్‌ ఇచ్చుకోవడం కొత్తేమీ కాదు. 

కాగా, శ్రీలంకతో నిన్న జరిగిన సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 4 వికెట్ల తేడాతో శ్రీలంకను మట్టికరిపిం​చి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ 40.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను చేతిక్కించుకుంది. 

Advertisement
Advertisement