వరుణుడి ఖాతాలో మరో మ్యాచ్‌

21 Sep, 2023 21:01 IST|Sakshi

గత రెండు, మూడు వారాల్లో చాలావరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు వర్షాల కారణంగా రద్దైన విషయం విధితమే. వర్షకాలంలో ఇది సాధారణమైన విషయమే అయినప్పటికీ.. పలు కీలక మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. తాజాగా మరో మ్యాచ్‌ కూడా వరుణుడి ఖాతాలోకి చేరింది. బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 21) జరిగిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దైంది. 

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు, ప్రారంభమయ్యాక 5వ ఓవర్లో వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడిన న్యూజిలాండ్‌ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు బరిలోకి దిగింది. 5వ ఓవర్ తర్వాత మ్యాచ్‌ మరో 28 ఓవర్ల పాటు సజావుగా సాగింది. ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌ జరుగుతున్న సమయంలో వర్షం మళ్లీ మొదలై ఆటకు ఆటంకం కలిగించింది. అప్పటికి న్యూజిలాండ్‌ స్కోర్‌ 33.4 ఓవర్లలో 136/5గా ఉంది. ఈ దశలో మొదలైన వర్షం​ ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి టామ్‌ బ్లండెల్‌ (8), కోల్‌ మెక్‌కొంచీ (8) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ (58), హెన్రీ నికోల్స్‌ (44) రాణించగా.. ఫిన్‌ అలెన్‌ (9), చాడ్‌ బోవ్స్‌ (1), రచిన్‌ రవీంద్ర (0) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నసుమ్‌ అహ్మద్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా సెప్టెంబర్‌ 23న జరుగనుంది. ఈ సిరీస్‌ అనంతరం బంగ్లా, న్యూజిలాండ్‌ జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు చేరుకుంటాయి.

వర్షం కారణంగా నిన్న, ఇవాళ రద్దైన మ్యాచ్‌లు..

  • ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌ తొలి వన్డే
  • ఏషియాన్‌ గేమ్స్‌ 2023 మహిళల క్రికెట్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌లు
  • బంగ్లాదేశ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి వన్డే
మరిన్ని వార్తలు