రోహిత్‌ బాగా ఆడాడు.. బుమ్రా నా జట్టులో ఉండటం అదృష్టం: పాండ్యా | Sakshi
Sakshi News home page

బుమ్రా ఉండటం నా అదృష్టం.. సూర్యలాంటోడిని ఎప్పుడూ చూడలేదు: పాండ్యా

Published Fri, Apr 12 2024 11:11 AM

Blessed To Have Bumrah In My Side: MI Hardik Pandya After Win On RCB Lauds Surya - Sakshi

సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ మరోసారి సత్తా చాటింది. వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో పాయింట్ల ఖాతా తెరిచిన పాండ్యా సేన.. తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును మట్టికరిపించింది.

అద్భుత ఆట తీరుతో గురువారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి.. ఐపీఎల్‌-2024లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఐదు వికెట్లు పడగొట్టి ఆర్సీబీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టిన ముంబై ఇండియన్స్‌ ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

మరోవైపు.. హార్డ్‌ హిట్టర్‌, ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌(19 బంతుల్లో 52)తో తిరిగి ఫామ్‌లోకి రావడంతో.. ముంబై శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఈ ఇద్దరు ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. 

వరుసగా రెండో విజయం సాధించడంపై స్పందిస్తూ.. ‘‘ గెలవడం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్‌లో గెలిచిన తీరు మరింత ఆనందాన్ని ఇచ్చింది. 

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన కెప్టెన్‌గా నాకు కాస్త వెసలుబాటు కల్పించిందనే చెప్పాలి. రోహిత్‌(24 బంతుల్లో 38), ఇషాన్‌ కిషన్‌(34 బంతుల్లో 69) బ్యాటింగ్‌ చేసిన తీరు అద్భుతం. వాళ్లిద్దరూ కలిసి మా విజయానికి పునాది వేశారు.

నెట్‌ రన్‌ రేటు మెరుగుపరచుకునే క్రమంలో త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నది మా ప్రణాళిక. బుమ్రా లాంటి అద్భుతమైన బౌలర్‌ నా జట్టులో ఉండటం నా అదృష్టం. ప్రతి ఓవర్‌లోనూ ప్రభావం చూపాడు.

నేను తనకు అప్పగించిన పని పూర్తి చేశాడు. తను జట్టు కోసం ఏం చేయగలడో అదంతా చేశాడు. ఏ మ్యాచ్‌కు ముందైనా సరే నెట్స్‌లో తను తీవ్రంగా శ్రమిస్తాడు. అతడి నైపుణ్యాలు అమోఘం. ఇక నువ్వు ఫిఫ్టీ కొట్టడమే నీకు వెల్‌కమ్‌ బ్యాక్‌ లాంటిదని సూర్యకు చెప్పాను. 

సూర్య జట్టుతో ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు. అపోజిషన్‌ కెప్టెన్‌గా ఉన్నపుడు కూడా తనను అవుట్‌ చేసేందుకు పదునైన వ్యూహాలు రచించాల్సి వచ్చేది. కొన్ని ఏరియాల్లో అతడు మాత్రమే హిట్టింగ్‌ ఆడగలడు. నేను ఇంతకు ముందు అలాంటి బ్యాటర్‌ను చూడలేదు’’ అని హార్దిక్‌ పాండ్యా.. బుమ్రా, సూర్యలను కొనియాడాడు.

ముంబై ఇండియన్స్‌  వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్కోర్లు:
టాస్‌: ముంబై.. బౌలింగ్‌
ఆర్సీబీ స్కోరు: 196/8 (20)
ముంబై స్కోరు: 199/3 (15.3)
ఫలితం: ఏడు వికెట్ల తేడాతో బెంగళూరుపై ముంబై విజయం

చదవండి: చాలా బాధగా ఉంది.. అతడే మా కొంపముంచాడు! లేదంటేనా

Advertisement
Advertisement