Cheteshwar Pujara Scored Hundred In Duleep Trophy Semis VS Central Zone - Sakshi
Sakshi News home page

Cheteshwar Pujara: టీమిండియా నుంచి ఉద్వాసన.. కసితో శతక్కొట్టిన పుజారా

Published Fri, Jul 7 2023 1:25 PM

Cheteshwar Pujara Scored Hundred In Duleep Trophy Semis VS Central Zone - Sakshi

దులీప్‌ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో టీమిండియా నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా సెంచరీతో కదంతొక్కాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురయ్యానన్న కసితో ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసిన పుజారా.. తన అనుభవాన్నంత రంగరించి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో తన 60వ శతకాన్ని నమోదు చేశాడు. సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్ట్‌ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. 13 బౌండరీల సహకారంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారాకు మరో ఎండ్‌ నుం​చి సహకారం లేనప్పటికీ.. ఒంటిపోరాటం చేసి, తన జట్టుకు 300 పరుగులకు పైగా లీడ్‌ను అందించాడు. 

ఈ ఇన్నింగ్స్‌లో నోటెడ్‌ క్రికెటర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌ (6), పృథ్వీ షా (25) విఫలం కాగా.. టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్‌ యాదవ్‌ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. 

అంతకుముందు వెస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్‌ మావి (6/43) వెస్ట్‌ జోన్‌ పతనాన్ని శాశించాడు. ఆవేశ్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌, సౌరభ్‌ కుమార్‌, సరాన్ష్‌ జైన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. వెస్ట్‌ జోన్‌ బ్యాటర్లలో అతీత్‌ సేథ్‌ (74) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (7), సర్ఫరాజ్‌ ఖాన్‌ (0) నిరాశపరిచారు. 

ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ జోన్‌.. నగ్వస్వల్లా (5/74), అతీత్‌ సేథ్‌ (3/27), చింతన్‌ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్‌ హీరో రింకూ సింగ్‌ (48) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్‌ టూర్‌ కోసం ప్రకటించిన భారత టెస్ట్‌ జట్టులో పుజారాకు చోటు దక్కని విషయం తెలిసిందే.

Advertisement
Advertisement