ప్రపంచకప్‌ కెప్టెన్ల మీటింగ్‌.. స్టేజీపైనే నిద్రలోకి జారుకున్న బవుమా | ODI World Cup 2023: South Africa Captain Temba Bavuma Falls Asleep At Captains Meet, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Temba Bavuma Sleeping Photo: ప్రపంచకప్‌ కెప్టెన్ల మీటింగ్‌.. స్టేజీపైనే నిద్రలోకి జారుకున్న బవుమా

Published Wed, Oct 4 2023 7:03 PM

Cricket World Cup 2023: South Africa Captain Temba Bavuma Falls Asleep At Captains Meet, Pic Goes Viral - Sakshi

భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ రేపటి (అక్టోబర్‌ 5) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీకి ముందు నిర్వహకులు అన్ని జట్ల కెప్టెన్లతో ఇవాళ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ప్రోగ్రాంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా మిగతా 9 దేశాల కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. గతేడాది ఇంగ్లండ్‌కు జగజ్జేతగా నిలిపిన ఇయాన్‌ మోర్గన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా రవిశాస్త్రి అందరు కెప్టెన్లతో ఒక్కొక్కరిగా మాటలు కలుపుతూ వచ్చాడు. వరల్డ్‌కప్‌లో వారి ప్రణాళికలు, మెగా టోర్నీలో గత అనుభవాలు, భారత్‌లో వరల్డ్‌కప్‌ ఆడటం ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది.. ఇలా శాస్త్రి ఒక్కొక్క కెప్టెన్‌ నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నాడు. ఈ మధ్యలో​ కాస్త సమయం దొరకడంతో సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా స్టేజీపైనే నిద్రలోకి జారుకున్నాడు. ఇలా జరిగినందుకు బవుమాను కూడా నిందించడానికి వీల్లేదు.

ఎందుకంటే, అతను గడిచిన వారమంతా ప్రయాణంలో గడిపాడు. ప్రపంచకప్‌ కోసమని సౌతాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన బవుమా.. ఇక్కడికి వచ్చాక వ్యక్తిగత కారణాల చేత తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. సౌతాఫ్రికా నుంచి రెండు రోజుల కిందటే భారత్‌కు చేరుకున్న అతను తాజాగా కెప్టెన్ల మీటింగ్‌ కోసమని న్యూఢిల్లీ (వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌కు వేదిక) నుంచి అహ్మదాబాద్‌కు వచ్చాడు. ఏదిఏమైనప్పటికీ బవుమా స్టేజీపైనే కునుకు తీయడం మాత్రం వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉంటే, భారత్‌ వేదికగా రేపటి నుంచి (అక్టోబర్‌ 5) వన్డే వరల్డ్‌కప్‌ 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు జరుగబోయే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌-గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆడనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్‌ 14న భారత్‌.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది.


 

Advertisement
Advertisement