చరిత్ర సృష్టించిన హసరంగ.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన హసరంగ.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు

Published Sun, Jun 25 2023 7:39 PM

CWC Qualifier 2023: Hasaranga Take Hat Trick Fifers, Sri Lanka Beat Ireland By 133 Runs - Sakshi

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగ చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్‌ 25) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అతను.. వరుసగా మూడు వన్డేల్లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లు (16 వికెట్లు) పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పాకిస్తాన్‌ స్పీడ్‌స్టర్‌ వకార్‌ యూనిస్‌ మాత్రమే వన్డేల్లో హ్యాట్రిక్‌ ఫైఫర్స్‌ (15 వికెట్లు) సాధించాడు.

ఈ టోర్నీలో యూఏఈతో (8-1-24-6) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన హసరంగ.. ఆ తర్వాత ఒమన్‌తో (7.2-2-13-5) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, తాజాగా ఐర్లాండ్‌పై (10-0-79-5) మరోసారి 5 వికెట్ల ఘనత సాధించాడు. హసరంగ చెలరేగడంతో ఐర్లాండ్‌పై శ్రీలంక 133 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, గ్రూప్‌-బి నుంచి సూపర్‌ సిక్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓటమితో ఐర్లాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా గ్రూప్‌-బి నుంచి శ్రీలంకతో పాటు స్కాట్లాండ్‌, ఒమన్‌లు సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్‌-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్‌, వెస్టిండీస్‌ సూపర్‌ సిక్స్‌కు చేరుకున్నాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (103) సెంచరీతో కదంతొక్కగా.. సదీర సమరవీర (82) అర్ధసెంచరీతో రాణించాడు. చరిత్‌ అసలంక (38), ధనంజయ డిసిల్వ (42 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అదైర్‌ 4, బ్యారీ మెక్‌కార్తీ 3, గెరత్‌ డెలానీ 2 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌.. హసరంగ (5/79) మహీష్‌ తీక్షణ (2/28), కసున్‌ రజిత (1/22), లహీరు కుమార (1/33), దసున్‌ షనక (1/21) ధాటికి 31 ఓవర్లలో 192 పరుగులకు కుప్పకూలింది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో కర్టిస్‌ క్యాంపర్‌ (39) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement