అజేయ లంక.. క్వాలిఫయర్స్‌ ఫైనల్లో జయకేతనం | Sakshi
Sakshi News home page

CWC Qualifiers 2023: అజేయ లంక.. క్వాలిఫయర్స్‌ ఫైనల్లో జయకేతనం

Published Sun, Jul 9 2023 7:23 PM

CWC Qualifiers 2023 Final: Sri Lanka Beat Netherlands By 128 Runs - Sakshi

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో శ్రీలంక అజేయ జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని శ్రీలంక.. వన్డేల్లో తమ విజయ పరంపరను కొనసాగించింది. ఈ ఫార్మాట్లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన శ్రీలంక.. ఇవాళ (జులై 9) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌పై 128 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, క్వాలిఫయర్స్‌ విజేతగా నిలిచింది. 

ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో లంక బౌలర్లు చెలరేగిపోయారు. మహేష్‌ తీక్షణ (6.3-1-31-4), దిల్షన్‌ మధుశంక (7-1-18-3), హసరంగ (7-1-35-2) నెదర్లాండ్స్‌ పతనాన్ని శాసించారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కొత్త ఆటగాడు సహన్‌ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్‌ మెండిస్‌ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్‌ బీక్‌, ర్యాన్‌ క్లెయిన్‌, విక్రమ్‌జీత్‌ సింగ్‌, సాకిబ్‌ జుల్ఫికర్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్‌ దత్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌.. తీక్షణ, మధుశంక, హసరంగ ధాటికి 23.3 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌ ఓడౌడ్‌ (33), వాన్‌ బీక్‌ (20 నాటౌట్‌), విక్రమ్‌జీత్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. మధుశంకకు ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డు దక్కగా.. టోర్నీ ఆసాంతం రాణించిన జింబాబ్వే ప్లేయర్‌ సీన్‌ విలియమ్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్‌ జట్లు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement