CWC Qualifiers 2023: Reasons Behind West Indies Downfall In Cricket - Sakshi
Sakshi News home page

తొలి రెండు ప్రపంచకప్‌ టోర్నీల్లో ఎదురులేని గెలుపు.. మూడోసారి రన్నరప్‌! కానీ ఇప్పుడు.. విండీస్‌ దుస్థితికి కారణాలివే

Published Sun, Jul 2 2023 10:02 AM

CWC Qualifiers 2023: Reasons Behind West Indies West Indies Cricket Downfall Why - Sakshi

వెస్టిండీస్‌... ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు. కరీబియన్‌ బౌలింగ్‌ అంటేనే బ్యాటర్లు బెంబేలెత్తేవారు. తొలి రెండు ప్రపంచకప్‌ (1975, 1979) టోర్నీలను ఎదురేలేకుండా గెలుచుకుంది. మూడో ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది.

అయితే ఇది గతం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జట్టు ఇప్పుడు భారత్‌కు రావడం లేదన్నది వర్తమానం. అంటే వన్డే ప్రపంచకప్‌కు కరీబియన్‌ జట్టు దూరమైంది. క్వాలిఫయింగ్‌ దశలోనే ఇంటికెళ్లనుంది. ఇది విండీస్‌ అభిమానులకే కాదు... క్రికెట్‌ విశ్లేషకులకు పెద్ద షాక్‌!    

ICC Cricket World Cup Qualifiers 2023హరారే: వెస్టిండీస్‌ ప్రపంచకప్‌ ముచ్చట జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయర్స్‌లోనే ముగిసిపోయింది. వన్డే మెగా టోరీ్నలో ఆడే అర్హత కోల్పోయింది. ‘సూపర్‌ సిక్స్‌’ దశలో స్కాట్లాండ్‌ చేతిలో పరాభవంతో కరీబియన్‌ జట్టు ని్రష్కమణ అధికారికంగా ఖరారైంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఏడు వికెట్ల తేడాతో విండీస్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది.

టాపార్డర్‌లో బ్రాండన్‌ కింగ్‌ (22 బంతుల్లో 22; 5 ఫోర్లు) రెండు పదుల స్కోరు చేస్తే మిగతా ఇద్దరు చార్లెస్‌ (0), బ్రూక్స్‌ (0) ఖాతానే తెరువలేదు. కెప్టెన్‌ షై హోప్‌ (13), కైల్‌ మేయర్స్‌ (5) చెత్తగానే ఆడారు. 60 పరుగులకే టాప్‌–5 వికెట్లను కోల్పోయిన విండీస్‌ కష్టాల్లో పడింది. ఈ దశలో నికోలస్‌ పూరన్‌ (43 బంతుల్లో 21; 2 ఫోర్లు) పెద్దగా మెప్పించలేదు.

తలరాతను తలకిందులు చేశాడు
షెఫర్డ్‌ (43 బంతుల్లో 36; 5 ఫోర్లు)తో కలిసిన  హోల్డర్‌ (79 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఏడో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఆదుకున్నాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో మెక్‌ములెన్‌ 3, క్రిస్‌ సోల్, మార్క్‌వాట్, క్రిస్‌ గ్రీవ్స్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్‌ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలిచింది.

ఓపెన్‌ మాథ్యూ క్రాస్‌ (107 బంతుల్లో 74 నాటౌట్‌; 7 ఫోర్లు), మెక్‌ములెన్‌ (106 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించి విండీస్‌ ‘కప్‌’ రాతను కాలరాశారు.  

కరీబియన్‌కు ఎందుకీ దుస్థితి?
జింబాబ్వేకు వచి్చన వెస్టిండీస్‌ జట్టులోని సభ్యుల్లో ప్రపంచకప్‌కు అర్హత సాధించాలి... భారత్‌కు వెళ్లాలి అన్న కసి, పట్టుదల కనిపించనే లేదు. అవే ఉంటే ఫీల్డింగ్‌ ఇంత ఘోరంగా చేయరు. బౌలింగ్‌ ఎంత పేలవం అంటే... నెదర్లాండ్స్‌తో కీలకమైన సూపర్‌ ఓవర్లో బౌండరీలు దాటే ఆరు బంతులు (4, 6, 4, 6, 6, 4; హోల్డర్‌ బౌలర్‌) వేయరు.

నిలకడేలేని బ్యాటింగ్‌తో ఆడరు. ఇలా అన్ని రంగాల్లో చెత్త ప్రదర్శన వల్లే రెండుసార్లు ‘విజేత’ తాజా ‘అనర్హత’ అయ్యింది. ఇప్పుడు మిగతా ‘సూపర్‌ సిక్స్‌’ దశలో ఒమన్, శ్రీలంకలతో ఆడి ఇంటికెళ్లిపోవడమే మిగిలింది. వెస్టిండీస్‌ అంటేనే ఒకప్పుడు అరివీర భయంకర బౌలర్లు, దంచికొట్టే బ్యాటింగ్‌ ఆజానుబాహులు గుర్తొచ్చేవారు.

కానీ ప్రస్తుతం నామమాత్రంగా జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు... ఫ్రాంచైజీ లీగ్‌ల్లో మాత్రం మెరిపించే వీరులు కనబడుతున్నారు. విండీస్‌ బోర్డు కుమ్ములాటలు, ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులపై తరచూ పేచీలతో స్టార్‌ ఆటగాళ్లంతా టీమ్‌ స్పిరిట్‌ మరిచి వ్యక్తిగతంగా కలిసొచ్చే టి20 లీగ్‌లపై కష్టపడటం నేర్చారు.

దీంతో అసలైన సంప్రదాయ క్రికెట్‌ (టెస్టు), పరిమిత ఓవర్ల ఆట (వన్డే)లను పట్టించుకోవడం మానేశారు. జట్టుగా పట్టుదలతో ఆడటం అనే దాన్నే మర్చిపోయారు. ఇప్పుడు కరీబియన్‌ ఆటగాళ్లంతా ఐసీసీ తయారు చేసిన భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ)ను పూర్తి చేస్తున్నారు. కానీ విండీస్‌ భవిష్యత్తుకు అవసరమైన షెడ్యూల్‌ను ఎప్పుడో పక్కన బెట్టేశారు. అందువల్లే వెస్టిండీస్‌ జట్టుకు ఈ దుస్థితి దాపురించింది. 

చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్‌ కెప్టెన్‌

Advertisement
Advertisement