ఇలాగే ఉంటే ప్లంబర్‌ పనికి రావాలి.. మారి చూపించాడు! టెస్టుల్లో టీ20 ఇన్నింగ్స్‌తో.. | Sakshi
Sakshi News home page

ఇలాగే ఉంటే ప్లంబర్‌ పనికి రావాలి.. మారి చూపించాడు! టెస్టుల్లో టీ20 ఇన్నింగ్స్‌తో..

Published Sun, Jan 14 2024 5:35 PM

David Warner Cricket Journey Life History Unknown Interesting Facts - Sakshi

సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం తమ జట్టును ఎంపిక చేసేందుకు ఆస్ట్రేలియా సెలక్టర్లు కూర్చున్నారు. ఆ సమయంలో డేవిడ్‌ వార్నర్‌ అనే కుర్రాడి పేరు ప్రస్తావనకు వచ్చింది. అతను అప్పటికే రెండేళ్లుగా టి20ల్లో రాణిస్తూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఆసీస్‌ సంప్రదాయం ప్రకారం దేశవాళీ క్రికెట్‌లో నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడని ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేసే అవకాశం లేదు. టి20 ఫార్మాట్‌లో ఎంపిక చేసేందుకైనా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడాలనేది గట్టి అభిప్రాయం. దీనిపై సెలక్టర్ల సమావేశంలో తీవ్ర చర్చ సాగింది. అతని దూకుడైన ఆటతో  కొత్తగా ప్రయోగం చేయవచ్చని ఒక వాదన.

అయితే అది ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ విలువను తగ్గిస్తుందనేది మరో వాదన. చివరకు మొదటి వాదనే నెగ్గింది. ఆసీస్‌ చరిత్రలో 1877 తర్వాత ఫస్ట్‌క్లాస్‌ స్థాయి క్రికెట్‌ ఆడకుండానే టీమ్‌లోకి ఎంపికైన తొలి ఆటగాడిగా వార్నర్‌ పేరుపొందాడు. అతనూ తన సత్తా చాటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

టి20 శైలి దూకుడుతో టెస్టు క్రికెట్‌లో అనూహ్య ఫలితాలు సాధించి తర్వాతి ఏడేళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌లో నంబర్‌వన్‌ టెస్టు బ్యాటర్‌గా నిలిచాడు. అంతే కాదు.. కెరీర్‌ ఆసాంతం మూడు ఫార్మాట్‌లలోనూ రికార్డులు కొల్లగొట్టిన అరుదైన ఆటగాళ్ళలో ఒకడిగా వార్నర్‌ తన పేరు రాసుకున్నాడు. 

‘నువ్వు క్రికెట్‌ను ఇష్టపడ్డావని, బాగా ఆడతావని నాన్న నీకు అవకాశం కల్పించాడు. నువ్వు ఇలాగే ఉంటే ఆట అవసరం లేదు. నేను ప్లంబర్‌ను. నా పని ఎలా ఉంటుందో నీకు తెలుసు. నీ ప్రవర్తన మార్చుకోకపోతే నాతో పాటు పనికి వచ్చేయ్‌. నీకూ కొన్ని డబ్బులు వస్తాయి. ఇద్దరం కలసి ఇంటిని నడిపిద్దాం’ 20 ఏళ్ల డేవిడ్‌కు అతని అన్న స్టీవ్‌ హెచ్చరిక ఇది.

చిన్నతనంలో వార్నర్‌కు క్రికెట్‌ను ఎంచుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఆటపై అతనికి మొదటనుంచీ ఆసక్తి ఉంది. అభ్యంతరాలు లేకుండా అతని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి అందులో చేర్పించారు. తగిన మార్గనిర్దేశనంతో సరైన శిక్షణ కూడా ఇప్పించారు. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ చేయాలనే వారి ఆలోచనకు తగినట్లుగా వార్నర్‌ సాధన చేశాడు.

స్కూల్‌ స్థాయి క్రికెట్‌లో అపార ప్రతిభ కనబరచి ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డుకు చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందేందుకు వార్నర్‌ అవకాశం దక్కించుకున్నాడు. అయితే బ్రిస్బేన్‌లోని ఈ కేంద్రంలో క్రమశిక్షణ తప్పడంతో అకాడమీవాళ్లు అతడిని ఇంటికి పంపించేశారు. దాంతో అతని అన్న ఆ రకంగా క్లాస్‌ తీసుకోవాల్సి వచ్చింది. అంతే.. ఆ తర్వాత డేవిడ్‌ ఏ తప్పూ చేయలేదు.

ప్రత్యేక విజ్ఞప్తితో మళ్లీ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. మరో ఆలోచన లేకుండా తీవ్రంగా శ్రమించాడు. మూడేళ్లు తిరిగేసరికి ఏకంగా ఆస్ట్రేలియా టి20 జట్టులోకి ఎంపికై తనను తాను నిరూపించుకున్నాడు.

వార్నర్‌ సోదరుడితో పాటు అతని తల్లిదండ్రులూ వార్నర్‌ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసి ఆనందబాష్పాలు రాల్చారు. మెల్‌బోర్న్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ పోరులో 43 బంతుల్లోనే 89 పరుగులు చేసిన వార్నర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలవడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తోనే అతను తన రాకను ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేశాడు. 

వేగంగా దూసుకుపోయి..
క్రికెట్‌లోకి అడుగు పెట్టాక వార్నర్‌ ఏరోజూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్కూల్, అండర్‌–13, అండర్‌–15, అండర్‌19.. ఇలా జూనియర్‌ స్థాయి క్రికెట్‌ నుంచే సంచలన ప్రదర్శనలు కనబరచిన అతను చాలా వేగంగా ఎదిగిపోయాడు. గ్రౌండ్‌ బయటకు బంతులను పంపించే భారీ షాట్లు, ప్రతీ అడుగులో దూకుడు, అద్భుతమైన ఫీల్డింగ్‌ వార్నర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

నాలుగు రోజుల మ్యాచ్‌ అయినా, వన్డే అయినా, టి20లు అయినా ఒకటే ధాటి.. ఒకే తరహా మెరుపు ప్రదర్శన. సొంత జట్లు సిడ్నీ, న్యూసౌత్‌వేల్స్‌ల తరఫున అతను అన్ని రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. అందుకే ఆస్ట్రేలియా జట్టులో అవకాశం కూడా తొందరగా వచ్చింది.

పెర్త్‌లోని వాకా మైదానంలో భారత్‌పై టెస్టులో 69 బంతుల్లో చేసిన శతకం వార్నర్‌ స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వైస్‌ కెప్టెన్సీ అవకాశం వచ్చి చేరింది.

కెరీర్‌ ఆరంభంలో ఉడుకు రక్తంతో ఇంగ్లండ్‌ ఆటగాడు రూట్‌పై పబ్‌లో దాడి చేసినా.. అతని ప్రదర్శన ముందు ఆ ఘటన వెనక్కి వెళ్లిపోయి చెడ్డ పేరును తుడిచిపెట్టింది. వరుసగా ఏడేళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఓపెనర్‌గా వార్నర్‌ కెరీర్‌ అద్భుతంగా సాగింది. 

పాతాళానికి పడేసిన క్షణం..
ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించరాదనేది సాధారణంగా ఆటగాళ్ల లక్షణం. కానీ ఏం చేసైనా, ఎలాగైనా ఆటలో గెలవాలనేది ఆస్ట్రేలియన్ల సూత్రం. ఎక్కువ సందర్భాల్లో ఇది బాగా పని చేసినా.. పరిధి దాటినప్పుడు అది సమస్యను తెచ్చి పెడుతుంది.

2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్‌.. అంతకు ముందు మ్యాచ్‌లో ఆసీస్‌ ఓటమిపాలైంది. పైగా గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కీపర్‌ డి కాక్‌తో వ్యక్తిగత దూషణలతో వార్నర్‌ గొడవ పెట్టుకున్నాడు. ఆ కసి ఇంకా మనసులో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించే ఆలోచనతో అతను చేసిన ప్రయత్నం కెరీర్‌ను దెబ్బ కొట్టింది.

కెప్టెన్‌ స్మిత్, మరో ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌తో కలసి కుట్రకు వార్నర్‌ తెర లేపాడు. స్యాండ్‌ పేపర్‌తో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేయడం అంతా బహిర్గతమైంది. దాంతో ఏడాది పాటు క్రికెట్‌ ఆడకుండా నిషేధంతో పాటు జీవితకాలం కెప్టెన్సీ ఇవ్వకుండా వేటు పడింది. దాంతో ఒక్కసారిగా అతను నైతికంగా కూడా నేలకూలాడు. 

తిరిగొచ్చి కొత్తగా..
సంవత్సర కాలపు నిషేధంలో వార్నర్‌ తనను తాను మార్చుకున్నాడు. ముందుగా ఎక్కువ సమయం కుటుంబంతో గడపడంతో పాటు ఆట కారణంగా కోల్పోయిన వ్యక్తిగత సంతోషాన్ని వెతుక్కున్నాడు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు, స్నేహాలు అతడికి గుడ్‌ బాయ్‌ ఇమేజ్‌ను తీసుకొచ్చాయి.

క్రికెటర్‌గా వార్నర్‌ ఘనమైన రికార్డు కారణంగా జట్టులో పునరాగమనానికి ఇబ్బంది కాలేదు. ఏడాది పూర్తి కాగానే మళ్లీ జట్టులోకి వచ్చేసిన అతను తిరిగి చెలరేగి తన విలువేంటో చూపించాడు. వన్డే వరల్డ్‌ కప్, యాషెస్‌ సిరీస్, సొంతగడ్డపై పాకిస్తాన్‌తో చేసిన ట్రిపుల్‌ సెంచరీతో వార్నర్‌ పరుగుల ప్రదర్శన జోరుగా కొనసాగింది.

ఈసారి అన్నింటికంటే పెద్ద మార్పు మైదానంలో అతని ప్రవర్తనే. ఒక్కటంటే ఒక్క వివాదం రాకుండా జాగ్రత్తపడిన అతను గ్రౌండ్‌లో తన ఆట తప్ప మరొకటి పట్టించుకోలేదు. మాటల్లో దూకుడు, ప్రత్యర్థులపై స్లెడ్జింగ్‌ ఎక్కడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే తన కలుపుగోలుతనంతో అందరికీ ఇష్టుడయ్యాడు కూడా.

వార్నర్‌ను మళ్లీ కెప్టెన్‌ చేసే చర్చలో భాగంగా అతడిని ట్యాంపరింగ్‌ వివాదంలో కుటుంబంతో సహా బహిరంగ విచారణకు హాజరు కావాలని ఆసీస్‌ బోర్డు సూచించింది. అయితే తన తప్పునకు తన కుటుంబాన్ని లాగడం అనవసరం అంటూ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తాను సాధించినదాంతో ఇలాగే బాగున్నానంటూ వార్నర్‌ దండం పెట్టేశాడు. 

ఐపీఎల్‌తో భారత అభిమానులకు చేరువై..
ఐపీఎల్‌ ఆరంభంలో ఢిల్లీ జట్టుకు ఆడిన వార్నర్‌ ఆ తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు వరుస విజయాలు అందించిన అతను 2016లో ఒంటిచేత్తో టీమ్‌ను ఐపీఎల్‌ విజేతగా కూడా నిలిపాడు.

ఈ క్రమంలో తెలుగు పాటలు, డాన్స్‌లతో అతను మన అభిమానులకూ చేరువయ్యాడు. ఎంతగా అంటే వార్నర్‌ అంటే మనోడే అన్నంతగా హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ అతడిని సొంతం చేసుకున్నారు. కరోనా టైమ్‌లో అతను తన ఇంట్లో తెలుగు సినిమా పాటలకు చేసిన డాన్స్‌లు, అతని అమ్మాయిలు కూడా అదే తరహాలో కనిపించడం విశేషంగా ఆకట్టున్నాయి.

ఆ తర్వాత ఎప్పుడు మైదానంలోకి దిగినా ఈ వినోదాన్ని అందించడానికి అతను సిద్ధంగా ఉండేవాడు. ముఖ్యంగా పుష్ప తగ్గేదేలే సిగ్నేచర్‌ సైన్‌.. శ్రీవల్లి పాటకు డాన్స్‌ మైదానంలో రొటీన్‌ అయిపోయాయి. అల్లు అర్జున్‌ బుట్టబొమ్మ పాటకు కూడా అంతే ఉత్సాహంతో వార్నర్‌ డాన్స్‌ చేసి చూపించడం విశేషం.

వివిధ కారణాలతో సన్‌రైజర్స్‌ టీమ్‌ వార్నర్‌ను కాదనుకున్నా.. తెలుగు ఫ్యాన్స్‌ మాత్రం ఇంకా అతడిని తమవాడిలాగే చూస్తున్నారనేదానికి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్‌ కప్‌ వామప్‌ మ్యాచ్‌లో అతనికి లభించిన ఆదరణే ఉదాహరణ.

అన్నీ సాధించి..
టెస్టు, వన్డే క్రికెట్‌కు ఇప్పటికే రిటైర్మెంట్‌ ప్రకటించిన వార్నర్‌ వచ్చే వరల్డ్‌ కప్‌ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉంది. ప్రపంచ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక విజయాలన్నింటిలో భాగమైన అతి అరుదైన ఆటగాడిగా వార్నర్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు.

రెండు వన్డే వరల్డ్‌ కప్‌లు, ఒక టి20 వరల్డ్‌ కప్, టెస్టుల్లో వరల్డ్‌ కప్‌లాంటి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలిచిన జట్లలో అతను సభ్యుడు. 2021.. టి20 వరల్డ్‌ కప్‌లో మెరుపు బ్యాటింగ్‌తో అతను ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా కూడా నిలిచాడు.

ఐపీఎల్‌ టైటిల్‌ను, అదీ కెప్టెన్‌గా సాధించిన ఘనత కూడా వార్నర్‌ సొంతం. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు వార్నర్‌ 111 టెస్టులు, 161 వన్డేలు, 99 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 
-∙మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

Advertisement
Advertisement