వార్నర్‌ ‘గ్రేట్‌’ కాదు.. ఆ జాబితాలో వాళ్లు ముగ్గురే: ఆసీస్‌ మాజీ కోచ్‌ | Sakshi
Sakshi News home page

David Warner: వార్నర్‌ ‘గ్రేట్‌’ క్రికెటర్‌ కాదు.. ఆ జాబితాలో వాళ్లు ముగ్గురే: ఆసీస్‌ మాజీ కోచ్‌

Published Tue, Jan 9 2024 4:02 PM

David Warner Not Great Not That Category: Ex Australia Coach - Sakshi

ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ గురించి ఆ జట్టు మాజీ కోచ్‌ జాన్‌ బుకానన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్‌ మెరుగైన బ్యాటరేనని.. అయితే, అంత గొప్ప ఆటగాడేమీ కాదని అన్నాడు. ఆసీస్‌ గ్రేట్‌ అన్న జాబితాలో అతడికి చోటు దక్కే ప్రసక్తే లేదన్నాడు.

కాగా ఆసీస్‌ ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు సాధించిన వార్నర్‌ ఇటీవలే టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో సంప్రదాయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. వన్డేల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు ప్రకటించిన అతడు ఇకపై టీ20లకు మాత్రమే పరిమితం కానున్నాడు. 

ఈ నేపథ్యంలో ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడుతున్న సందర్భంగా ఆసీస్‌ మాజీ కోచ్‌ జాన్‌ బుకానన్‌కు వార్నర్‌ను ‘గ్రేట్‌’ అనొచ్చా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. నేనైతే అలా అనుకోవడం లేదు. తన కెరీర్‌ ఆసాంతం అతడు అద్భుతంగా ఆడాడు.

వందకు పైగా టెస్టులు ఆడిన అనుభవం అతడికి ఉంది. 8 వేలకు పైగా పరుగులు సాధించాడు. 160కి పైగా వన్డేలు, 100 వరకు టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో అతడి బ్యాటింగ్‌ సగటు కూడా బాగానే ఉంది. స్ట్రైక్‌ రేటు కూడా బాగుంది.

ప్రదర్శనపరంగా అతడు మెరుగైన స్థానంలో ఉన్నాడు. అయితే, ఒక క్రీడలో దిగ్గజాల గురించి చెప్పాల్సి వచ్చినపుడు నా వరకైతే ఆసీస్‌ తరఫున డాన్‌ బ్రాడ్‌మన్‌, గ్లెన్‌ మెగ్రాత్‌, షేన్‌ వార్న్‌ వంటి వాళ్లే గుర్తుకువస్తారు.

నా దృష్టిలో వాళ్లు ముగ్గురే గ్రేట్‌ ప్లేయర్లు. మిగతా వాళ్లలో చాలా మంది వీరికి చేరువగా వచ్చిన గ్రేట్‌ కేటగిరీలో చోటు సంపాదించలేరు. వార్నర్‌ కూడా అంతే’’ అని బుకానన్‌ చెప్పుకొచ్చాడు. కాగా తన కెరీర్‌లో ఆఖరి సిరీస్‌లో వార్నర్‌ శతకం బాదాడు. ఇక పాక్‌తో జరిగిన ఆ సిరీస్‌లో ఆసీస్‌ 3-0తో వైట్‌వాష్‌ చేసింది. సొంతగడ్డపై పాకిస్తాన్‌పై వరుసగా పదిహేడవ విజయం నమోదు చేసింది.

Advertisement
Advertisement