Sakshi News home page

Denmark Open 2022 :క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌

Published Fri, Oct 21 2022 8:53 AM

Denmark Open: Lakshya Sen through to quarterfinals - Sakshi

ఒడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పరాజయంపాలయ్యాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ పోరులో సింగపూర్‌కు చెందిన ఏడో సీడ్‌ లో కీన్‌ యూ 21–13, 21–15 స్కోరుతో శ్రీకాంత్‌ను ఓడించాడు.

35 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఏపీ షట్లర్‌ శ్రీకాంత్‌ తగిన పోటీ ఇవ్వడంలో విఫలమయ్యాడు. అయితే మరో భారత ప్లేయర్‌ లక్ష్య సేన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో లక్ష్య 21–9, 21–18 స్కోరుతో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ను చిత్తు చేశాడు. గత రెండు మ్యాచ్‌లలో ప్రణయ్‌ చేతిలో ఓడిన సేన్‌ ఈ సారి పదునైన ఆటతో చెలరేగి 39 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు.   

గాయత్రి–ట్రెసా జోడి ఓటమి... 
పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి జంట క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ భారత షట్లర్లు 21–14, 2–16తో ఇండోనేసియాకు చెందిన ముహమ్మద్‌ షోహిబుల్‌ – బగాస్‌ మౌలానాలను ఓడించారు. అయితే మహిళల డబుల్స్‌లో భారత జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్‌ – ట్రెసా జాలీకి చుక్కెదురైంది.

థాయిలాండ్‌కు చెందిన జొంగొల్ఫాన్‌ కిటిథారకుల్‌ – రవీంద ప్రజొంగ్‌జాయ్‌ ద్వయం 23–21, 21–13 స్కోరుతో గాయత్రి–ట్రెసాపై విజయం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌కు చెందిన ఇషాన్‌ భట్నాగర్‌ – తనీషా క్రాస్టో 16–21, 10–21 తేడాతో యుటా వతనబె – అరిసా హిగాషినో (జపాన్‌) చేతిలో ఓటమిపాలయ్యారు.
చదవండి: World Shooting Championship: భారత షూటర్ల జోరు

Advertisement
Advertisement