Sakshi News home page

ఆర్చరీలో ‘డబుల్‌’ ధమాకా 

Published Sun, Aug 20 2023 5:43 AM

Double Dhamaka in Archery - Sakshi

పారిస్‌: భారత ఆర్చర్లు ప్రపంచకప్‌ స్టేజ్‌–4 ఈవెంట్‌లో పసిడి పంట పండించారు. కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో ‘డబుల్‌’ ధమాకా సాధించాయి. రికర్వ్‌ జట్లు కాంస్య పతకాలు గెలిచాయి. పురుషుల కాంపౌండ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ, ఓజస్‌ ప్రవీణ్, ప్రథమేశ్‌ జౌకర్‌లతో కూడిన భారత జట్టు శని వారం జరిగిన ఫైనల్లో  236–232 స్కోరుతో క్రిస్‌ షాఫ్, జేమ్స్‌ లుజ్, సాయెర్‌ సలైవాన్‌లతో కూడిన అమెరికా జట్టుపై ఘన విజయం సాధించింది.

మూడు రౌండ్లు ముగిసేసరికి ఇరు జట్లు సమంగా నిలవగా, కీలకమైన చివరి రౌండ్‌లో భారత్‌ పైచే యి సాధించింది. పురుషుల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో సెమీస్‌లో ఓడిన భారత జట్టు కాంస్య పతక పోరులో స్పెయిన్‌ టీమ్‌పై గెలిచింది.

ధీరజ్‌ బొమ్మదేవర, అతాను దాస్, తుషార్‌లతో కూడిన భారత్‌ 6–2తో స్పానిష్‌ టీమ్‌ను ఓడించి కాంస్యం గెలుచుకుంది. మహిళల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భజన్‌ కౌర్, అంకిత భకత్, సిమ్రాన్‌జీత్‌ కౌర్‌లు ఉన్న భారత త్రయం కాంస్య పతక పోరులో 5–4తో మెక్సికో జట్టుపై గెలిచింది.  

అమ్మాయిల జట్టు పైచేయి 
మహిళల కాంపౌండ్‌లో జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్, పర్నీత్‌ కౌర్‌లతో కూడిన భారత బృందం 234–233తో మెక్సికో జట్టుపై గెలిచి పసిడి పతకం చేజిక్కించుకుంది. తొలి రౌండ్లో 59–59తో అండ్రియా బెకెరా, అనా సోఫియా, డాఫ్నే క్వింటెరోలతో కూడిన మెక్సికో జట్టుతో భారత్‌ స్కోరు సమంచేసింది.

రెండో రౌండ్లో 59–58తో స్వల్ప ఆధిక్యం కనబరిచింది. 118–117 తో మూడో రౌండ్లోకి దిగిన భారత ఆర్చర్లు 57–59తో వెనుకబడ్డారు. 175–176తో ఆధిక్యం మెక్సికోవైపు మళ్లింది. ఈ దశలో నాలుగో రౌండ్‌పై దృష్టిపెట్టిన ఆర్చర్లు 59 స్కోరు చేస్తే... మెక్సికన్‌ అమ్మాయిలు 57 స్కోరే చేయడంతో పాయింట్‌ తేడాతో భారత్‌ (234–233) స్వర్ణ పతకం గెలుపొందింది.

జ్యోతి సురేఖ @ 50 
ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ పోటీల్లో పతకాల ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఈ టోర్నీకి ముందు 48 పతకాలు సాధించిన ఆమె శనివారం కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. అనంతరం వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుచుకోవడంతో 50వ పతకం ఆమె ఖాతాలో చేరింది.

సెమీస్‌లో ఓడిన ఆమె మూడో స్థానం కోసం కొలంబియాకు చెందిన సారా లోపెజ్‌తో తలపడింది. స్కోరు 146–146తో సమం కాగా, షూటాఫ్‌లోనూ 10–10తో సమంగా నిలిచారు. అయితే లక్ష్యబిందువుకు అతి సమీపంగా కచ్చితత్వంతో కూడిన బాణాలు సంధించిన జ్యోతినే విజేతగా ప్రకటించడంతో కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో కలిపి గెలిచిన మొత్తం 50 పతకాల్లో 17 స్వర్ణాలు, 18 రజతాలు, 15 కాంస్యాలున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement