Duleep Trophy 2023: శతక్కొట్టిన సీఎస్‌కే మాజీ ప్లేయర్‌.. తుస్సుమన్న రింకూ సింగ్‌

29 Jun, 2023 07:50 IST|Sakshi

దులీప్‌ ట్రోఫీ 2023లో ఐపీఎల్‌ ఆటగాళ్ల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఓ మాజీ ఆటగాడు సెంచరీతో కదంతొక్కితే.. మరొకరు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. సీఎస్‌కే మాజీ ఆటగాడు,  నార్త్‌ జోన్‌ ఓపెనర్‌ ధృవ్‌ షోరే సెంచరీతో కదంతొక్కగా.. 2023 సీజన్‌ కేకేఆర్‌ స్టార్‌, సెంట్రల్‌ జోన్‌ ఆటగాడు రింకూ సింగ్‌ (38) ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమయ్యాడు.

బెంగళూరు: భారత క్రికెట్‌ దేశవాళీ సీజన్‌ 2023–2024 దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లతో బుధవారం మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో ప్రారంభమైన క్వార్టర్‌ ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి నార్త్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. 90 ఓవర్లు ఆడిన నార్త్‌ జోన్‌ 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఓపెనర్‌ ధ్రువ్‌ షోరే (211 బంతుల్లో 136; 22 ఫోర్లు) సెంచరీ సాధించాడు. నిశాంత్‌ సింధు (113 బంతుల్లో 76 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), పుల్కిత్‌ నారంగ్‌ (23 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. 

సెంట్రల్‌ జోన్‌ 182 ఆలౌట్‌ 
ఆలూర్‌లో ఈస్ట్‌ జోన్‌ జట్టుతో జరుగుతున్న మరో క్వార్టర్‌ ఫైనల్లో సెంట్రల్‌ జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71.4 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్‌ స్టార్‌ రింకూ సింగ్‌ (38; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈస్ట్‌ జోన్‌ బౌలర్‌ మణిశంకర్‌ మురాసింగ్‌ 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఈస్ట్‌ జోన్‌ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు సాధించింది.    

>
మరిన్ని వార్తలు