Shubman Gill: అదొక్కటి తప్ప.. అన్నీ పూర్తి చేశానని చెప్పేందుకు గర్విస్తున్నా

1 Jan, 2024 11:55 IST|Sakshi

Shubman Gill About 2023: 2023.. తనకు మరుపురాని అనుభవాలు మిగల్చడంతో పాటు ఎన్నో పాఠాలు నేర్పిందని టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అన్నాడు. అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు తాను శాయశక్తులా కృషి చేశానని.. కొత్త సంవత్సరంలో మరిన్ని కఠిన సవాళ్లకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఒకటీ రెండు చేదు అనుభవాలు మినహా.. 2023 గొప్పగా గడిచిందని ఈ యువ ఓపెనర్‌ హర్షం వ్యక్తం చేశాడు.

వన్డేల్లో ద్విశతకం
కాగా గతేడాది శుబ్‌మన్‌ గిల్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదడంతో పాటు.. టెస్టు, టీ20 ఫార్మాట్లోనూ సెంచరీలతో మెరిశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి వరల్డ్‌కప్‌ కూడా ఆడాడు. మొత్తంగా 2023లో 29 వన్డేలు ఆడి 1584 పరుగులు చేసిన గిల్‌.. టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఫ్రాంచైజీ క్రికెట్‌లో దుమ్ములేపాడు
అంతేగాకుండా ఫ్రాంఛైజీ క్రికెట్‌లోనూ గొప్పగా రాణించాడు. ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున 17 ఇన్నింగ్స్‌ ఆడి 890 పరుగులు సాధించాడు గిల్‌. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.

ఇలా సీజన్ ఆసాంతం బ్యాట్‌ ఝులిపించిన ఈ పంజాబీ బ్యాటర్‌.. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు. అదే విధంగా హార్దిక్‌ పాండ్యా టైటాన్స్‌ను వీడటంతో ఐపీఎల్‌-2024 ఎడిషన్‌కు గానూ అతడి స్థానంలో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

అందుకు గర్విస్తున్నా
ఈ క్రమంలో.. 2023కు వీడ్కోలు పలుకుతూ శుబ్‌మన్‌ గిల్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ షేర్‌ చేశాడు. ‘‘గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాల్లో.. భారత్‌ తరఫున అత్యధిక శతకాలు బాదడం.. నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచటం.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం.. వరల్డ్‌కప్‌ గెలవడం.. వంటివి ఉన్నాయి.

వీటిలో ఒక్కటి మినహా దాదాపుగా అన్నీ సాధించాను. 2023 ఎన్నో అనుభవాలు మిగిల్చింది. సరదాలు, సంతోషాలతో పాటు ఎన్నో గుణపాఠాలను నేర్పింది. అయితే, అనుకున్నట్లుగా ఏడాదిని పూర్తి చేయలేకపోయా(టీమిండియా వరల్డ్‌కప్‌ ఓటమి).

అయితే, లక్ష్యాలకు చేరువగా వచ్చామని గర్వంగా చెప్పగలను. వచ్చే ఏడాదిలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగి.. 2024లో గోల్స్‌ సాధిస్తామని ఆశిస్తున్నా’’ అని గిల్‌ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 2023లో తను సాధించిన విజయాల తాలుకు ఫొటోలతో పాటు.. తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోను శుబ్‌మన్‌ గిల్‌ ఇందుకు జతచేశాడు.

చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్‌ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా?

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

>
మరిన్ని వార్తలు